టీడీపీకి పట్టం!
ఆంధ్రప్రదేశ్ లోని పట్టభద్రుల(గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటింది. ఇన్నాళ్లు ఉత్తరాంధ్రపై ఆశలు పెట్టుకున్న అధికార వైసీపీకి పట్టభద్రులు షాక్ ఇచ్చారు. తూర్పు రాయలసీమ, ఉత్తరాంధ్ర స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం టీడీపీ కైవసం అయింది. ప్రముఖ అధ్యాపకుడు వేపాడ చిరంజీవి అనూహ్యమైన విజయం సాధించారు. ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనంతరం ఆయన గెలుపును ఎన్నికల సంఘం ప్రకటించింది.
తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి గెలిచిన కంచర్ల శ్రీకాంత్ గెలిచారు. ఏడు రౌండ్లలో 2 లక్షల 69 వేల 339 ఓట్లు పోలవ్వగా ఇందులో 20 వేల 979 ఓట్లు చెల్లలేదు. మిగిలిన 2 లక్షల 48 వేల 360 ఓట్లు లెక్కించగా రెండో ప్రాధాన్య ఓట్లతో కలిపి తెదేపా అభ్యర్థి లక్షా 12 వేల 686 ఓట్లు సాధించారు. వైసీపీ అభ్యర్థి శ్యాంప్రసాద్‌రెడ్డికి 85 వేల 423 ఓట్లు వచ్చాయి. అర్ధరాత్రి వరకూ రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు కొనసాగింది. తనకు ఓటు వేసి గెలిపించిన వారికి విజేత కంచర్ల శ్రీకాంత్ కృతజ్ఞతలు తెలిపారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీ గెలుపొందడటం పట్ల హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ట స్పందించారు. ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై తిరుగుబాటుకు ఈ ఎన్నికలే నిదర్శనమని..టీడీపీపై ప్రజలకు గౌరవమే కాకుండా నమ్మకం కూడా ఉందని దీనికి ఈ పట్టభద్రుల ఎన్నికల్లో వస్తున్న ఫలితాలే నిదర్శనమని బాలయ్య కామెంట్ చేశారు. మూడు స్థానాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగగా..రెండో చోట్ల టీడీపీ, ఒక చోట వైసీపీ గెలుపొందే అవకాశం ఉంది. రెండు కీలకమైన ప్రాంతాల్లో టీడీపీ విజయకేతనం ఎగురవేయడంతో టీడీపీ నేతల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రతిపక్షానికి ఈ విజయం ఎంతో ఊరటనిచ్చింది.