అప్పుడే అమ్మ పొయ్యి దగ్గర రొట్టెలు చేస్తోంది. నేను నా బుల్లి బుల్లి నడకతో అమ్మదగ్గరకు వెలుతున్నాను. వెంటనే అన్నయ్య సూరి వచ్చి అమ్మదగ్గరకు వెల్లకుండా ఎత్తుకున్నాడు. అమ్మ అన్నయ్యతో తమ్ముడిని కాసేపు ఆడించురా నేను రొట్టెలు అయిపోగానే తీసుకుంటాను అని చెప్పింది. అన్నయ్య అమ్మకు సరే అని చెప్పి నన్ను ఆడిస్తూ బయటకు తీసుకెళ్లాడు. చీకటి పడటంతో అందరూ అరుగులపై కూర్చుని ముచ్చట పెడుతున్నారు. మా ఇంటి పక్క అక్క అన్నయ్యతో మాట్లాడుతూ…ఏరా అందరం అంతాక్షరి ఆడుకుందామా, కథలు, జోకులు చెప్పుకుందామా అని అడిగింది. అన్నయ్య ఆ అక్కకు సరే అంతాక్షరి ఆడుకుందాం అని చెప్పాడు. మా చుట్టుపక్కల ఇళ్లలోని పిల్లలంతా మా అరుగుమీదకు చేరి కాసేపు అలా పాటలు పాడుకున్నారు. కాసేపటికి కరెంటు వచ్చింది. అందరం ఇళ్లలోకి వెళ్లిపోయారు. మేము మా ఇంట్లోకి వెళ్లి టీవీల ముందు కూర్చుని సీరియల్స్ చూస్తూ ఉంటే అంతలోనే నాన్న వచ్చాడు. అన్నయ్యతో మాట్లాడుతూ…ఏరా హోం వర్క్ అయిపోయిందా అని అడిగాడు. అన్నయ్య వెంటనే నేను రాసుకుంటాను అని నన్ను అమ్మకు ఇచ్చి పుస్తకాలు తీసాడు. మా చిన్నన్న కన్నయ్య కూడా నాన్న చెప్పకముందే పుస్తకాలు తీసి రాసుకుంటున్నాడు. అమ్మ కాసేపటికి చదివింది చాలు ఇగ తినండి అని అందరికీ రొట్టెలు ఇచ్చింది. వెంటనే అందరికీ రొట్టెలు ఇచ్చి కూర వడ్డించ్చింది. నేను పాలు తాగి పడుకున్నాను. (పార్ట్ 1)