సీఎం చంద్రబాబు, ఆయన కొడుకు, విద్యా శాఖ మంత్రి లోకేష్ టెన్త్ పరీక్షల నిర్వహణలో పూర్తిగా ఫెయిల్ అయ్యారని మాజీ సీఎం వైయస్ జగన్ విమర్శించారు. కూటమి పాలనలో విద్యారంగం భ్రష్టుపట్టిపోయిందని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. ప్రభుత్వ అవివేక, అనాలోచిత, పరిణితిలేని నిర్ణయాలతో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కష్టాలే ఎదురవుతున్నాయన్నారు. పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనాన్ని కూడా సరిగ్గా నిర్వహించలేని దుస్థితిలో ఉన్న మీరు, మిగతా వ్యవస్థలను ఇంకా ఎంత ఘోరంగా నడుపుతున్నారో అర్థం అవుతోందన్నారు. 2.6.14 లక్షల మంది రాత్రీపగలూ కష్టపడి చదివి పరీక్షలు రాస్తే, జవాబు పత్రాలను సరిగ్గా దిద్ది, పారదర్శకంగా ఫలితాలు వెల్లడించాల్సిన మీరు, ఘోరంగా విఫలమై, విద్యార్థులను, వారి తల్లిదండ్రులను క్షోభకు గురిచేశారన్నారు.ఈ తప్పుల కారణంగా ట్రిపుల్ ఐటీ, గురుకుల జూనియర్ కాలేజీలు సహా ఇతరత్రా అడ్మిషన్లలో విద్యార్థులు అన్యాయమైపోయిన ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయన్నారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో చదివే ప్రతి విద్యార్థి ప్రపంచస్థాయిలో పోటీని ఎదుర్కొనేలా తీసుకొచ్చిన అనేక సంస్కరణలను వచ్చీరాగానే దెబ్బతీశారన్నారు.గతంలో ఉన్న ప్రతి మంచి కార్యక్రమాన్ని కక్షగట్టి నీరుగార్చారన్నారు.ఈ తప్పులకు బాధ్యులైన విద్యాశాఖ మంత్రి లోకేష్‌తో మొదలు అందరిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.