ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ పథకాన్ని బలహీనపర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపించారు. ప్రభుత్వ అప్పులకు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రులకు ఎలాంటి సంబంధముందని ప్రశ్నించిన ఆయన, ప్రభుత్వం ఏర్పడి 450 రోజులు గడిచినా ఆసుపత్రులకు బిల్లులు చెల్లించకపోవడం దారుణమని మండిపడ్డారు.మీడియాతో మాట్లాడుతూ అప్పలరాజు పేర్కొన్నదేమిటంటే, ఆరోగ్యశ్రీ పథకం 2006-07లో ప్రారంభమైనప్పటి నుంచి కూటమి ప్రభుత్వ కాలంలో రెండు సార్లు నిలిచిపోయిందని, ఇలాంటి గొప్ప పథకం నిలిచిపోవడం బాధాకరమన్నారు. ఆరోగ్యశ్రీ పేరు చెప్పితే రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ గుర్తుకు వస్తారని, అందుకే చంద్రబాబు ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు.పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ ప్రైవేట్ ఆసుపత్రులు నిరసనలు చేపడుతున్నాయని, ఆరు నెలలు ఎదురు చూసినా చెల్లింపులు జరగక మళ్లీ సమ్మెలకు దిగుతున్నాయని చెప్పారు. ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు.
ప్రభుత్వ అప్పులకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్, ప్రైవేట్ ఆసుపత్రులను భరోసాగా చూపించడం అన్యాయమని, అప్పులు ప్రభుత్వమే తీసుకుని భారాన్ని ఇతరులపై మోపడం సరికాదన్నారు. రెండేళ్లలోనే భారీగా అప్పులు చేసి, పాలనలో వైఫల్యం కారణంగా ప్రైవేటీకరణ వైపు ప్రభుత్వం వెళ్లుతోందని ఆరోపించారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్మించిన మెడికల్ కళాశాలలను ప్రైవేట్ వారికి అప్పగించడం పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని, అన్ని రంగాలను ప్రైవేటు చేతుల్లోకి ఇస్తే ఆరోగ్య శాఖ అవసరం ఏమిటని ప్రశ్నించారు. ప్రజలపై ఆరోగ్య వ్యయభారం పెరుగుతోందని, దాన్ని తగ్గించాలన్న సూచనలను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అప్పలరాజు విమర్శించారు.

