మహిళల జీవితంలో మాతృత్వానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. పెళ్లయిన ప్రతి స్త్రీ తల్లి కావాలని కోరుకుంటుంది. అది వారి లైఫ్ లో మర్చిపోలేని అనుభూతి అనే చెప్పాలి. అందుకే ఆ మధుర క్షణాలను జీవితాంతం గుర్తుపెట్టుకోవాలని అనుకుంటారు. అలాంటి ప్రెగ్నెన్సీ విషయంలో మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. తమ ఆరోగ్యం విషయంలో గర్భిణులు అస్సలు కాంప్రమైజ్ కాకూడదు. ఈ విషయంలో డాక్టర్ల సలహాలు పాటిస్తూ ఉండాలి.
రోజువారీ తీసుకునే ఆహారం దగ్గర నుంచి వేసుకునే మందుల వరకు చాలా విషయాల్లో గర్భిణులు కేర్ తీసుకోవాలి. అప్పుడే ప్రెగ్నెన్సీ టైమ్ తో పాటు ప్రసవం తర్వాత కూడా తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉండగలరు లేకపోతే అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రెగ్నెన్సీ టైమ్ లో పలు వ్యాధుల బారిన పడకుండా ఉండటం గర్భిణులకు మంచిది. అందులో డెంగ్యూ కూడా ఒకటి.
ఈ సీజన్‌లో జాగ్రత్త
డెంగ్యూ జ్వరం గర్భిణులతో పాటు వారి కడుపులో పెరిగే శిశువు మీదా తీవ్ర ప్రభావం చూపుతుందని హెల్త్ ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. డెంగ్యూ కేసులు వర్షాకాలంలో అధికంగా వస్తాయి. దోమలు గుడ్లు పొదిగే సీజన్ కావడంతో ఈ సమయంలో అవి తమ సంఖ్యను రెట్టింపు చేసుకుంటాయి. అలాంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధే డెంగ్యూ. ఇది పేద ప్రజల్ని ఎక్కువగా టార్గెట్ చేస్తోంది. పేదల చుట్టూ అపరిశుభ్రమైన వాతావరణం అధికంగా ఉండటమే దీనికి కారణం.
గర్భిణులకు ప్రమాదం
డెంగ్యూ జ్వరం ప్రెగ్నెంట్ విమెన్ కు వస్తే మాత్రం చాలా ప్రమాదకరంగా మారే ఛాన్స్ ఉంది. దీని వల్ల ప్రసవం ముందే అవడం లేదా బిడ్డ గర్భంలోనే చనిపోవడం లాంటి సమస్యలు వస్తాయని హెల్త్ ఎక్స్ పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. గర్భంలో పెరిగే పిండానికి సపోర్ట్ గా ఇమ్యూనిటీ సిస్టమ్ లో అనేక మార్పులు వస్తాయి. దీని వల్ల రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా మారుతుంది.
ఇద్దరికీ సోకొచ్చు
శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా మారడం వల్ల గర్భిణులు డెంగ్యూ జ్వరం లాంటి ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఎక్కువని హెల్త్ ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. ఈ ఇన్ఫెక్షన్ తల్లి, బిడ్డ.. ఇద్దరికీ సోకే ఛాన్స్ ఉంది. దీని వల్ల బిడ్డ తక్కువ బరువుతో పుట్టడం లేదా నెలలు నిండకుండా జన్మించడం.. కొన్నిసార్లు గర్భంలోనే ప్రాణం పోవడం వంటివి జరుగుతాయి. కాబట్టి డెంగ్యూ జ్వరం విషయంలో గర్భిణులు చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఇవి పాటించాల్సిందే
డెంగ్యూ రాకుండా ఉండాలంటే దోమల బెడద లేకుండా చూసుకోవాలి. ఇందులో భాగంగా ఇంటి చుట్టూ నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. బాడీ అంతా కవర్ అయ్యేలా దుస్తులు వేసుకోవాలి. దోమతెరల్ని వాడుతూ ఉండాలి. దోమలు అధికంగా ఉండే ప్రాంతాలకు వెళ్లకూడదు. కిటికీలు ఎప్పుడూ వేసే ఉంచాలి. జ్వరం వస్తే తేలిగ్గా తీసుకోకూడదు. వెంటనే డాక్టర్లను కలవాలి.
ఇవి తినాల్సిందే
సీజనల్ కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినాలి. డెంగ్యూ సోకిన తర్వాత కొన్ని రకాల ఫుడ్స్ ను కచ్చితంగా తీసుకోవాలి. కొబ్బరినీళ్లు తాగడంతో పాటు కప్పు పెరుగు తినాలి. కొబ్బరినీళ్ల వల్ల శరీరంలోని ఖనిజాలు లోపించకుండా ఉంటుంది. పెరుగులోని ప్రోబయోటిక్స్ ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి. టీ, కాఫీలకు దూరంగా ఉండాలి. హెర్బల్ టీలు తాగుతూ ఉండాలి.