ఇప్పుడు ఎక్కడ చూసినా వన్డే వరల్డ్ కప్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. క్రికెట్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ మెగా టోర్నీ గురువారం మొదలైంది. ప్రపంచ కప్ ను హోస్ట్ చేస్తున్న భారత్ లో వరల్డ్ కప్ సందడి ఒక రేంజ్ లో ఉంది. అయితే ఈ టైమ్ లో ప్రముఖ భారతీయ క్రికెటర్ కు సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. ఆ క్రికెటర్ మరెవరో కాదు శిఖర్ ధవన్. ఈ టీమిండియా ఓపెనర్ విడాకుల వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. శిఖర్ ధవన్ తన భార్య అయేషా ముఖర్జీకి డివోర్స్ ఇచ్చాడు. ఈ దంపతులకు ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది.
ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేయడంతో శిఖర్ ధవన్- అయేషా ముఖర్జీల 11 ఏళ్ల వివాహ బంధం రద్దయింది. కొన్నాళ్లు ప్రేమించుకున్న వీళ్లు ఇంట్లో వాళ్లను ఒప్పించి 2012లో మ్యారేజ్ చేసుకున్నారు. అయితే ఈ కేసు విచారణ టైమ్ లో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయేషా నుంచి ధవన్ పడిన మానసిక వేదన కోర్టు దృష్టికి వచ్చింది. భార్య తనను మానసికంగా వేధించిందంటూ ధవన్ తరఫు లాయర్ కోర్టుకు నివేదించారు. కొడుకుతో ఇన్నాళ్ల పాటు విడిగా ఉండాలని అయేషా ముఖర్జీ ఒత్తిడికి గురిచేయడంతో ధవన్ మానసిక వేదనకు గురయ్యాడని జడ్జి పేర్కొన్నారు.
కోర్టు పర్మిషన్
ఈ కేసులో ధవన్ కుమారుడి పర్మినెంట్ కస్టడీకి సంబంధించి ఉత్తర్వులు జారీ చేయడానికి ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు నిరాకరించింది. కానీ ఆస్ట్రేలియాలో ఉంటున్న తన కొడుకు జొరావర్ ను చూసేందుకు మాత్రం ధవన్ కు కోర్టు అనుమతించింది. స్కూల్ అకడమిక్ షెడ్యూల్ ను దృష్టిలో ఉంచుకొని.. పాఠశాల సెలవుల సమయంలో ధవన్, అతడి కుటుంబ సభ్యులను కలిసేందుకు జొరావర్ ను భారత్ కు తీసుకురావాలని అయేషాను ఢిల్లీ కోర్టు ఆదేశించింది. మ్యారేజ్ కు ముందు ధవన్ తో కలసి ఇండియాలో ఉండేందుకు అయేషా అంగీకరించిందని న్యాయవాదులు వివరించారు. కానీ ఆమెకు అప్పటికే మొదటి పెళ్లి ద్వారా పుట్టిన ఇద్దరు కూతుళ్లు ఉన్నారని పేర్కొన్నారు.
తీవ్ర వేధింపులు
శిఖర్ ధవన్ కు ముందుగా మాట ఇచ్చిన ప్రకారం భారత్ లో అయేషా ఎక్కువ కాలం నివసించలేదన్నారు న్యాయవాదులు. కొడుకు జొరావర్ ను అయేషా ఆస్ట్రేలియాలో పెంచిందని చెప్పారు. ఇందులో ధవన్ తప్పు లేకున్నా కుమారుడ్ని దూరం చేసిన అయేషా.. అతడ్ని మానసిక ఆవేదనకు గురిచేసిందని నివేదించారు. ధవన్ తన సొంత డబ్బులతో కొనుగోలు చేసిన మూడు ఆస్తుల్లో ఒకదాన్ని 99 శాతం తన పేరు మీద రాయాలని అయేషా ఒత్తిడి చేసిందని కోర్టుకు వివరించారు. అలాగే మిగిలిన రెండు ఆస్తుల్లో తననకు ఉమ్మడి యజమానిగా ఉంచాలని ధవన్ ను వేధించిందని చెప్పుకొచ్చారు.