భయపెడుతున్న H3N2 వైరస్.. కేంద్రం ఏమందంటే..!
దేశాన్ని ఇన్ఫ్లుయెంజా వైరస్ భయపెడుతోంది. రోజురోజుకీ ఈ వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే కర్ణాటక, హర్యానాల్లో ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు వ్యక్తులు.. ఇన్ఫ్లుయెంజా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా హెచ్3ఎన్2 వైరస్ కేసులు ఎన్ని కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్ డేటా ప్రకారం దేశంలో 3,038 ఫ్లూ కేసులు నమోదయ్యాయి.
ఇన్ఫ్లుయెంజా ఫ్లూ కేసుల్లో 92 శాతం మంది పేషెంట్లు జ్వరంతో, 86 శాతం మంది దగ్గుతో, 27 శాతం మంది శ్వాస సంబంధింత సమస్యలతో బాధపడుతున్నారు. దాదాపు 10 శాతం మందికి ఆక్సిజన్ అవసరం ఉందట. 7 శాతం మంది ఈ ఫ్లూతో ఐసీయూల్లో ఉన్నట్లు తెలుస్తోంది. కొవిడ్ ప్రోటోకాల్స్ మాదిరిగానే మాస్కులు వేసుకోవడం, చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం లాంటివి పాటించాలని కేంద్రం సూచించింది. ఫ్లూతో బాధపడుతున్న వారితో చేతులు కలపడం వంటివి చేయొద్దని పేర్కొంది. ఫ్లూ పేషెంట్స్ బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయొద్దని కోరింది.