H3N2 Virus: ఇన్ఫ్లుయెంజా వైరస్ కరోనా కంటే డేంజరా?
దేశవ్యాప్తంగా ఇన్ఫ్లుయెంజా కేసులు పెరగడాన్ని చూస్తున్నాం. ఈ వైరస్ కారణంగా దేశంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ప్రతి ఏటా ఇదే సమయంలో ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. దీని వల్ల జ్వరం, దగ్గు, గొంతులో గరగర, ఒళ్లు నొప్పులు, జలుబు లాంటి సమస్యలు తలెత్తుతాయి. దీన్ని యాంటీజెనిక్ డ్రిఫ్ట్ అంటారు. ఇక, కరోనా గురించి చెప్పనక్కర్లేదు. ప్రపంచాన్ని ఈ మహమ్మారి ఎంత అతలాకుతలం చేసినందో తెలిసిందే. ఇప్పుడు ఇన్ఫ్లుయెంజా హెచ్3ఎన్2 వైరస్ల మధ్య చాలా మంది పోలిక తీసుకొస్తున్నారు. మరి ఈ రెండింట్లో ఏది డేంజరో తెలుసుకుందాం..
కరోనా అనేది సార్స్ కొవ్-2 వల్ల వస్తుంది. అదే హెచ్3ఎన్2 అనేది ఇన్ఫ్లుయెంజా వైరస్‌లో ఒకరకం. ఆర్తోమీగ్జో విరిడే అనే సమూహంలో ఇన్ఫ్లుయెంజా ఒక భాగం. కరోనా పుట్టుకపై ఇప్పటికీ సందేహాలున్నాయి. గత రెండు నెలలుగా మన దేశంలో ఇన్ఫ్లుయెంజా కేసుల గురించి వింటున్నాం. ఇన్ని రోజుల్లో ఈ వైరస్ కారణంగా రెండు మరణాలే నమోదయ్యాయి. కానీ కొవిడ్ వల్ల భారత్‌లో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇన్ఫ్లుయెంజా ఫ్లూ వల్ల ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య కూడా తక్కువేనని ఏయిమ్స్ ఢిల్లీ మాజీ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా చెప్పారు.