ఏపీ రాజధాని అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయిన సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. నేడు సుప్రీం కోర్టులో ఆయన కేసు విచారణ జరిగింది. కొమ్మినేని తరఫున పొన్నవోలు సుధాకర్‌రెడ్డి సహా న్యాయవాదులు వాదనలు వినిపించారు. విచారణ జరిపిన జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఆయనను వెంటనే విడుదల చేయాలని ఏపీ పోలీసులను ఆదేశించింది. 70 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తిని ఎలా అరెస్ట్ చేస్తారంటూ కోర్టు మండిపడింది. చర్చ జరుగుతున్న సమయంలో నవ్వినంత మాత్రాన అరెస్టు చేస్తారా అని ప్రశ్నించింది. అలాగైతే కేసుల విచారణ సందర్భంగా మేము కూడా నవ్వుతుంటామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. వాక్ స్వాతంత్య్రాన్ని రక్షించాలని సుప్రీం కోర్టుల అభిప్రాయపడింది. విడుదల సందర్భంగా అవసరమైన షరతులను ట్రయల్ కోర్టు విధిస్తుందని తెలిపింది.
చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు వ్యాఖ్యలు చేస్తే, కొమ్మినేనిపై కేసు ఎలా పెడతారని కోర్టు నిలదీసింది. ఆర్టికల్ 32 కింద ప్రాథమిక హక్కులకు భంగం కలిగించారని, కొమ్మినేని అరెస్టు అక్రమం అన్న వాదనలతో కోర్టు ఏకీభవించింది.