కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ నేడు మాజీ సీఎం కేసీఆర్‌ను విచారించనుంది. ఈ మేరకు కేసీఆర్ బీఆర్‌కే భవన్‌కు చేరుకున్నారు. కేసీఆర్ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రధాన నాయకులతో పాటు కార్యకర్తలు భారీ సంఖ్యలో బీఆర్‌కే భవన్‌కు తరలివచ్చారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డిది విధ్వంసకర పాలన అని, రాజకీయ వేధింపులు తప్ప ఆయనకు ఏం రాదని విమర్శించారు. పేదల ఇండ్లు, ప్రాజెక్టులు కూలగొట్టడమే రేవంత్ పాలన అని విమర్శించారు. బీఆర్‌కే భవన్‌లో కేసీఆర్‌ను జస్టిస్ పీసీ ఘోష్ విచారిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రీ ఇంజినీరింగ్, ఆనకట్టల నిర్మాణం, ఒప్పందాలు, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, నీటి నిల్వలపై ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. బీఆర్‌కే భవన్‌లోకి వెళ్లేందుకు కేసీఆర్‌తో పాటు మరో తొమ్మిది మంది నేతలను అనుమతించారు.