తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో అమరుల త్యాగాలు చిరస్మరణీయమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ గన్ పార్క్ లోని అమరవీరుల స్మారక స్థూపం వద్ద తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం పదకొండేళ్లు పూర్తి చేసుకుని పన్నెండో సంవత్సరంలో అడుగుపెడుతోందని, అమరుల త్యాగాలు చిరస్మరణీయమని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యాఖ్యానించారు.