ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటితో ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనలతో కూడిన రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రజల ఆశీర్వాదంతో ఏర్పాటైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా పాలనలో ఏడాది పూర్తి చేసుకుందన్నారు. ప్రజల ఆకాంక్షలను తీర్చడం కోసం శక్తి వంచన లేకుండా ప్రతి రోజూ పని చేస్తున్నట్లు చెప్పారు. అనేక సమస్యలను, ఆర్థిక సవాళ్లను దాటుకుని ఏడాది కాలంలోనే ‘పేదల సేవలో’, ‘పెన్షన్లు, ‘అన్న క్యాంటీన్లు’, దీపం-2, ‘తల్లికి వందనం’, ‘మత్స్యకార సేవలో’…లాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమల్లోకి తెచ్చామని వెల్లడించారు. మెగా డీఎస్సీతో టీచర్ ఉద్యోగాలు, పెట్టుబడులతో ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పనకు అడుగులు వేశామన్నారు. 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు సహా రైతు సంక్షేమానికి పలు నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. ఇరిగేషన్ ప్రాజెక్టు పనులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. రాజధాని నిర్మాణం, పోలవరం పనులను మళ్లీ గాడిన పెట్టామన్నారు. రైల్వే జోన్ సాధించి, స్టీల్ ప్లాంట్ పరిరక్షించామని స్పష్టం చేశారు. ప్రజల ఆశీర్వాద బలంతో రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని హామీ ఇచ్చారు. ఏడాది పాలనను విజయవంతం చేయడానికి సహకరించిన, పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.అవ్వాలని కోరుకుంటున్నాను.