హైడ్రాకు అడ్డువస్తే తొక్కుకుంటూ పోతామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. శనివారం హైదరాబాద్ చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర స్మారక దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గాంధీ కుటుంబానికి, దోపిడీ చరిత్ర ఉన్న వారికి పోలికేంటని కేసీఆర్ ను విమర్శించారు. దేశ సమగ్రత కోసం 34 ఏళ్ల క్రితం రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర చేపట్టారని గుర్తు చేశారు. సుదీర్ఘ కాలం ప్రజలకు సేవలందించిన గీతా రెడ్డి గారిని సద్భావన అవార్డుకు ఎంపిక చేయడం అభినందనీయమన్నారు. రాజకీయాల్లో పదవుల కోసం పాకులాడే వారిని చూసాం.. కానీ, గత ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పిన గొప్ప వ్యక్తి గీతారెడ్డి అని కొనియాడారు. గాంధీ కుటుంబం తీసుకున్న నిర్ణయాలతోనే కాంగ్రెస్ హయాంలో దేశంలో పేదలకు మేలు జరిగిందన్నారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు. మత సామరస్యాన్ని కాపాడుతూ తెలంగాణను అభివృద్ధి చేసుకొందామని పిలుపునిచ్చారు. ప్రభుత్వ భూములను, నాళాలు, చెరువులను ఆక్రమించుకుని పెద్ద పెద్ద భవంతులు కట్టిన వారిపట్ల హైడ్రా అంకుశం లాంటిదన్నారు. మదపుటేనుగులను అనచడానికి హైడ్రా అంకుశంలా పనిచేస్తుందన్నారు. కొందరు దీన్ని అడ్డుకోవాలని, రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ దెబ్బ తీయాలని కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. హైడ్రా అనగానే హరీశ్ రావు, కేటీఆర్ బయటకు వస్తున్నారని, పేదలకు మేలు జరిగితే చూసి ఓర్వలేకపోతున్నారన్నారు. మూసీలో మగ్గిపోతున్న వారికి ఇండ్లు ఇచ్చి, వ్యాపారాలు చేసుకునేందుకు మహిళలకు ఆర్థిక సాయం అందించామని పేర్కొన్నారు. హరీశ్ రావు, కేటీఆర్ బిల్లా రంగాల్లా వచ్చి బుల్డోజర్లకు అడ్డు పడతామంటున్నారని, అక్కడికి ఇక్కడికి కాదు.. జన్వాడ ఫామ్ హౌస్ కు పోదాం పదా అని సవాల్ చేశారు. గుల్ఖాపూర్ నాలాను ఆక్రమించుకుని కేటీఆర్ ఫామ్ హౌస్ కట్టారని ఆరోపించారు. కేటీఆర్ ఫామ్ హౌస్ కు బుల్డోజర్ వస్తుందనే డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు.