బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ నేతలపైనే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీలో దొంగలంతా ఒక్కటయ్యారని విమర్శించారు. దమ్ముంటే తనను బీజేపీ నుండి సస్పెండ్ చేయాలని సవాల్ విసిరారు. తనను సస్పెండ్ చేస్తే అందరి బాగోతాలు బయటపెడతా అంటూ వ్యాఖ్యానించారు. రాజాసింగ్ పట్ల క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, అతనికి నోటీసులు ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించుకుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. నోటీసులు ఇవ్వడం కాదు దమ్ముంటే పార్టీ నుండి సస్పెండ్ చేయండి, అప్పుడు ఎవరు పార్టీకి నష్టం చేస్తున్నారో బయటపెడతా అని రాజాసింగ్ పేర్కొన్నారు. ఇంటి దొంగలంతా ఒకటై బీజేపీని బీఆర్ఎస్ నాయకులకు తాకట్టు పెడుతున్నారని, కొంచెం ఎక్కువ ప్యాకేజ్ ఇస్తే పార్టీని బీఆర్ఎస్ కు తాకట్టు పెడతారని ఆరోపించారు.