తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నా అక్కడక్కడా డ్రగ్స్ వినియోగం, అమ్మకాలు జరగడం కలకలం రేపుతోంది. తాజాగా ఓ కానిస్టేబుల్ డ్రగ్స్ విక్రయించడం చర్చకు దారితీసింది. హైదరాబాద్‌లో డ్రగ్స్ దందా చేస్తున్న ఏపీ కానిస్టేబుల్‌ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలోని తిరుపతికి చెందిన ఓ కానిస్టేబుల్, బాపట్ల జిల్లా అద్దంకి నుంచి హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి రూ.2 కోట్ల విలువైన డ్రగ్స్ తీసుకొస్తుండగా ఆరుగురు ముఠా సభ్యులను సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ కానిస్టేబుల్ నుండి 840 గ్రాముల కొకైన్, ఇతర డ్రగ్స్, నగదు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ దందా చేస్తున్న తిరుపతికి చెందిన కానిస్టేబుల్ గుణశేఖర్, తిరుపతి రూరల్ ప్రాంతానికి చెందిన నిరుద్యోగి ఉన్నం సురేంద్ర, బాపట్ల జిల్లా కర్ల పాలెం మండలానికి చెందిన కాంట్రాక్టర్ దొంతి రెడ్డి హరిబాబు రెడ్డి, అద్దంకి మండలానికి చెందిన ఫాస్ట్ ఫియాడ్ నిర్వాహకురాలు చెగుడు మెర్సీ మార్గరేట్, షేక్ మస్తాన్వలీ, దేవరాజు యేసుబాబులను అదుపులోకి తీసుకన్నారు. వీరు ఎక్కడి నుంచి డ్రగ్స్ సేకరిస్తున్నారు, దీని వెనుక ఎవరున్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.