మంచు ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం కన్నప్ప. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్, కాజల్ అగర్వాల్, మోహన్‌లాల్ సహా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ నుంచి ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. కాగా , ఏదో ఒక వివాదాస్పద విషయాలతో ఈ సినిమా తరచూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా కన్నప్ప సినిమాకు సంబంధించి ముఖ్యమైన సమాచారం ఉన్న హార్డ్ డ్రైవ్‌తో ఇద్దరు వ్యక్తులు పరారీ అయినట్లు తెలుస్తోంది. కన్నప్ప సినిమాకు చెందిన అత్యంత కీలకమైన కంటెంట్ ఉన్న హార్డ్ డ్రైవ్‌ను, ఫిల్మ్ నగర్ లోని ఫోర్ ఫ్రేమ్స్ సంస్థకు డీటీడీసీ కొరియర్ ద్వారా ముంబాయి హెచ్ఐవీఈ స్టూడియోస్ పంపించింది. ఆ పార్సిల్ ఈ నెల 25న ఆఫీస్ బాయ్ రఘు తీసుకొని చరిత అనే మహిళకు అందించాడని, అప్పటి నుండి వారిద్దరు కనిపించడంలేదని ఫోర్ ఫ్రేమ్స్ సంస్థ తెలిపింది. కొంతమంది పెద్దవాళ్ళు తమ సినిమాకు నష్టం కలిగించడానికి కుట్ర చేస్తున్నారని, వారిద్దరిని పట్టుకొని చర్యలు తీసుకోవాలని ఫోర్ ఫ్రేమ్స్ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది.