VIRAT KOHLI : తండ్రి చనిపోయినా గెలిచేవరకు బ్యాటు వదలలేదు
1988 నవంబర్ 5 ప్రేమ్ కోహ్లీ, సరోజ్ కోహ్లీ దంపతులకు ఢిల్లీలోని ఒక పంజాబీ హిందూ కుటుంబంలో విరాట్ కోహ్లీ జన్మించాడు. విరాట్ కోహ్లీకి ఒక అన్నయ్య వికాస్, అక్క భావన ఉన్నారు. కోహ్లీ నాన్నగారు ఒక క్రిమినల్ లాయర్. మూడేండ్లప్పుడే బ్యాటు పట్టుకుని తండ్రిని బంతి వేయమని అడిగాడు. కోహ్లీ కుటుంబం ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ లో ఉండేవారు. విశాల్ భారత్ పబ్లిక్ స్కూల్ లో చదువుకున్నాడు. తన తోటి మిత్రులతో వీధుల్లో క్రికెట్ ఆడటాన్ని బాగా ఇష్టపడేవాడు. కోహ్లీ ఆట తీరును గమనించిన ఆయన నాన్నగారు ప్రోత్సహించేవారు. కోహ్లీ ఆటను గమనించిన ఇంటి పక్కవారు మీ అబ్బాయిని ఎక్కడైనా కోచింగ్ ఇప్పించండి అని అడిగేవారు. 1998లో రాజ్ కుమార్ వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమి స్థాపించారు. అక్కడకు 9 ఏండ్లప్పుడు వెళ్లిన కోహ్లీ అకాడమీ మొదటి బ్యాచ్ లో చేరారు. ఆట చాలు ఇంటికి వెళ్లమని చెప్పినా కూడా వెళ్లకుండా క్రికెట్ ఆడేవారని ఆయన స్నేహితులు పేర్కొన్నారు. అకాడమీ దూరంగా ఉందని 9వ తరగతి నుంచి పశ్చిమ విహార్ లో ఉన్న సేవియర్ కాన్వెంట్ లో చేర్పించారు. స్కూల్ అయిపోగానే రోజూ గ్రౌండ్ కి వెళ్లి క్రికెట్ ఆడేవాడు. క్రికెట్ మీద ఉన్న ఆసక్తి అతన్ని అండర్ 15లో చోటు దక్కేలా చేసింది. ఈ టోర్నమెంట్ లో 32.2 సగటున 170కి పైగా పరుగులు చేశాడు. దీంతో 2003, 2004 ఉమ్రిగర్ ట్రోఫీకి ఆడినప్పుడు టీం క్యాప్టెన్ ను చేశారు. ఆ టోర్నమెంట్ లో 390 పరుగులు చేసి సత్తా చాటాడు. దీంతో ఢిల్లీ అండర్ 17 కి విజయ్ మర్చెంట్ ట్రోఫికి ఎంపికయ్యాడు. ఈ టోర్నమెంట్ లో 470 పరుగులు సాధించి సత్తాచాటాడు.2004, 2005లోనూ విజయ్ మర్చెంట్ ట్రోఫీకి అండర్ 17 లో ఆడాడు. ఇందులో 7 ఇన్నింగ్స్ లో 750 పరుగులు చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇవన్నీ చూసి మొదటి సారి ఆయనకు ఢిల్లీ తరుఫున అవకాశం వచ్చింది. కానీ ఆ మ్యాచ్ లలో రాణించలేకపోయాడు. 2006 జులై ఇంగ్లాండ్ టూర్ లో అండర్ 19 జట్టుకు కోహ్లీని ఎంపిక చేశారు. అండర్ 19 తరుఫున 3 మ్యాచ్ లు ఆడి 150 పరుగులు చేసి అప్పటి వరకు విదేశీ గడ్డపై ఎవరూ రాణించలేకపోయిన కోహ్లీ సత్తా చాటారు. ఇప్పటికీ కోహ్లీ తన బ్యాటింగ్ తో అభిమానులందరినీ ఆకట్టుకుంటున్నారు.