అసెంబ్లీలో ఎమ్మెల్యేల ఫైటింగ్
ప్రజా సమస్యలపై చర్చించమని శాసన సభకు పంపిస్తే..అక్కడికెళ్లిన ఎమ్మెల్యేలు తమ బాధ్యతలు మరిచి రౌడీల్లా వ్యవహరిస్తున్నారు. ఇవాళ ఏపీ అసెంబ్లీలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. టీడీపీ.. వైసీపీ ఎమ్మెల్యేల మద్య ఘర్షణ వాతావరణం నెలకొంది. వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు..టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇద్దరు తలపడినట్లు తెలుస్తోంది.
ఉదయం సభ ప్రారంభం కాగానే నెంబర్ 1పైన టీడీపీ నిరసనకు దిగింది. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లిన టీడీపీ సభ్యులు పేపర్లు చింపి విసిరేసారు. దీని పైన మంత్రులు..వైసీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసారు. చంద్రబాబు పాల్గొన్న కందుకూరు..గుంటూరు సభల్లో చోటు చేసుకున్న తొక్కిసలాట.. మరణాల కారణంగానే ఈ జోవో అవసరమైందని వివరించారు. స్పీకర్ చెబుతున్నా..టీడీపీ సభ్యులు ఆందోళన కొనసాగించారు. స్పీకర్ వారించినా వెనక్కు తగ్గలేదు. సభను అడ్డుకోవటం సరికాదంటూ వైసీపీ సభ్యులు చెప్పుకొచ్చారు. ప్రశ్నోత్తరాలు జరగకుండా అడ్డుకోవటం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యుల తీరు పైన స్పీకర్ అసహనం వ్యక్తం చేసారు.
స్పీకర్ తమ్మినేని సీతారాం ముఖం కనపడకుండా టీడీపీ ఎమ్మెల్యే డోలా వీరాంజనేయులు ప్లకార్డు పెట్టటంతో అధికార పార్టీ సభ్యులు స్పందించారు. బీసీ స్పీకర్ ను అవమానించారని వైసీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసారు. స్పీకర్ ముఖం పైన ప్లకార్డు పెట్టటంతో స్పీకర్ దానిని లాగి చింపి పడేసారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు దురుసుగా వ్యవహరించారు.
ఈ సమయంలో వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఇతర వైసీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ కు రక్షణగా పోడియం వద్దకు వెళ్లారు. అధికార పార్టీ ఎమ్మెల్యే సంజీవయ్య టీడీపీ సభ్యుల మీద ఆగ్రహంతో ముందుకెళ్లారు. మంత్రి అంబటి ఆయన్ను అడ్డుకున్నారు. ఆ సమయంలో సుధాకర్ బాబు..డోలా మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు మోచేతికి రక్తగాయాలు అయ్యాయి. ఈ విషయాన్ని ఆయన మీడియా పాయింట్ వద్ద విలేకరులకు చూపించారు. అసెంబ్లీ సాక్షిగా టీడీపీ ఎమ్మెల్యేలు నా రక్తాన్ని కళ్లరా చూశారని ఆందోళన వ్యక్తం చేశారు.
అసెంబ్లీలో తనపై టీడీపీ సభ్యులు అనుచితంగా ప్రవర్తించడం పట్ల స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో టీడీపీ నేతలు చేసిన దౌర్జన్యాన్ని ఆయన ఖండించారు. తాను గౌతమ బుద్దుడు కాదన్న తమ్మినేని.. ఇకపై పోడియం దగ్గరకు వస్తే ఆటోమెటిక్ సస్పెన్షన్ చేస్తానని స్పీకర్ రూలింగ్ ఇచ్చారు. టీడీపీ సభ్యులు సభను అగౌరవ పరిచారని విమర్శించారు. సభలో టీడీపీ సభ్యుల ప్రవర్తన హేయమైన చర్యగా అభివర్ణించారు. టీడీపీ సీనియర్ సభ్యులే తనపై దాడులు చేయడం దురదృష్టకరమని స్పీకర్ తమ్మినేని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు సభ్యులంతా సమానమేనన్న తమ్మినేని.. సభలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు చూడలేదని తెలిపారు. టీడీపీ నేతల తీరు మారాలని స్పీకర్ వ్యాఖ్యానించారు. మొత్తానికి ఈ రోజు అసెంబ్లీలో ఘర్షణ వాతావరణం నెలకొంది.