రూ.30తో 100 కిలోమీటర్లు.. ఈ సూపర్ కారు గురించి తెలుసా?
మధ్యతరగతికి ఎన్నో ఆశలు ఉంటాయి. ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని, కార్లలో తిరగాలని ఉంటుంది. కానీ ఇల్లు కట్టాలన్నా, ఫ్లాట్ కొనాలన్నా లక్షలు ఖర్చవుతుంది. కారు కొన్నా అంతే. లక్షలకు లక్షలు ఆటోమొబైల్ షోరూమ్స్లో వెచ్చించాల్సిందే. అలాంటి మధ్యతరగతి ప్రజల కలలను నిజం చేయాలనుకున్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆటోమొబైల్ దిగ్గజం టాటా ఇండస్ట్రీస్ అధినేత రతన్ టాటా. మధ్యతరగతి ప్రజల కోసం చౌకైన ధరలో కారును అందించాలని ఆయన నిశ్చయించుకున్నారు. ఈ ప్రాజెక్టును ఆయన సొంత కలగా మార్చుకున్నారు. రాత్రింబవళ్లు కష్టపడి, అహర్నిషలు శ్రమించి నానో కారును మార్కెట్లోకి తీసుకొచ్చారు. రూ.లక్షకే కారును అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో అందరూ మురిసిపోయారు. కార్లలో తిరగొచ్చని ఆశపడ్డారు. కానీ లాభం లేకపోయింది.
పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ.. ఏదీ అవసరం లేదు
భద్రతా లోపాలు, నిర్మాణ లోపాలతో పాటు ఇతర కారణంగా నానో కారు ఉత్పత్తిని ఆపేశారు. మధ్యతరగతితో పాటు రతన్ టాటా ఆశలూ ఆవిరయ్యాయి. కానీ ఇప్పటికీ కొన్ని నానో కార్లు రోడ్ల మీద కనిపిస్తుంటాయి. అలాంటి ఓ కారు కథే ఇది. ఒక నానో కారు రూ.30కే 100 కిలోమీటర్లు తిరుగుతోంది. వెస్ట్ బెంగాల్‌లోని బంకురా సిటీలో ఉండే మనోజిత్ మోండల్ అనే వ్యాపారవేత్త టాటా నానో కారుతో స్థానికంగా పెద్ద సెలబ్రిటీగా మారిపోయారు. తన సొంత టాటా నానో కారును సోలార్ కారుగా మార్చి గల్లీల్లో రయ్‌మంటూ దూసుకెళ్తున్నారు మనోజిత్. ఆయన కారుకు పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ అవసరం లేదు. ఇది పూర్తిగా సోలార్ పవర్తో నడిచే కారు. ఈ కారుకు అయ్యే ఫ్యుయెల్ ఖర్చు అందరినీ షాక్కు గురిచేస్తోంది.
ఇంజిన్ లేని కారు
కేవలం రూ. 30 నుంచి రూ.35లతో 100 కిలోమీటర్లు నడుస్తుందీ నానో కారు. అంటే కిలోమీటరుకు రూ.80 పైసలు ఖర్చు అవుతుందన్న మాట. పెట్రోల్, డీజిల్ రేట్స్ రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో చాలా తక్కువ ఖర్చుతో నడిచేలా మోండల్ తయారు చేసిన నానో సౌరశక్తి కారు ఇప్పుడు ఆ ఏరియాలో మస్తు పాపులర్ అయింది. ఈ సోలార్ కారులో గేర్ సిస్టమ్ ఉండటం గమనార్హం. కానీ ఇందులో ఇంజిన్ మాత్రం లేదు. ఇది నడుపుతున్నప్పుడు అసలు సౌండ్ కూడా రాదట. నాలుగో గేర్‌లో గంటకు 80 కిలోమీటర్లు వెళ్తుంది. మోండల్ రూపొందించిన ఈ సోలార్ కార్ సౌరశక్తిలో సరికొత్త ఆవిష్కరణల దిశగా దిశానిర్దేశం చేయడమే కాకుండా పెరుగుతున్న ఫ్యుయెల్ రేట్స్తో ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు ఆశాకిరణంగా నిలుస్తోంది.