తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుకు మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు ఆల్కా లాంబా షాకిచ్చారు. ఇటీవల ఆమె గాంధీ భవన్‌లో ధర్నా చేయడంపై షోకాజ్ నోటీసులు పంపించారు. టీపీసీసీ అధ్యక్షుడికి వ్యతిరేకంగా గాంధీ భవన్‌లోనే ధర్నా చేయడంపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. పార్టీ, ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సునీతారావు ఆధ్వర్యంలో మహిళా నేతలు గాంధీభవన్‌లో మహేశ్‌కుమార్‌గౌడ్ ఛాంబర్ ముందు నిరసన తెలిపారు. ఎన్నికలప్పుడు మహిళా కాంగ్రెస్ విభాగం ఎంతో కష్టపడి పని చేసిందని, ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నామినేటెడ్ పదవుల విషయంలో తమకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. మహేశ్ కుమార్ గౌడ్ దీనిపై స్పందించడం లేదని, సీఎం ను కలవాలని చెబుతున్నారని ఆమె పేర్కొన్నారు. దీంతో అక్కడే ధర్నాకు దిగి నిరసన తెలిపారు.