ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పోలవరం జిల్లా పర్యటన మరోసారి వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం శుక్రవారం జరగాల్సిన పర్యటనను ఈ నెల 12వ తేదీకి మార్చినట్లు అధికారులు వెల్లడించారు. వరుసగా పర్యటన వాయిదా పడుతుండటంతో జనసేన కార్యకర్తల్లో కొంత నిరాశ నెలకొంది. మరోవైపు పవన్ కల్యాణ్ రాక కోసం మన్యం ప్రాంత ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పర్యటన వాయిదా పడినప్పటికీ అధికార యంత్రాంగం ఏర్పాట్లను కొనసాగిస్తోంది. ఇప్పటికే అధికారులు, భద్రతా సిబ్బంది రంపచోడవరం చేరుకోగా కాకవాడలో హెలిప్యాడ్ నిర్మాణం, బహిరంగ సభ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు రాకోట గ్రామంలో ప్రజలతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలు, స్థానికంగా ఉన్న ఇబ్బందులను తెలుసుకోనున్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధించిన అంశాలపై ఈ పర్యటనలో ప్రాధాన్యం ఉండే అవకాశం ఉంది. ఈ నెల 12న పర్యటన నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన నేపథ్యంలో ఈసారి పర్యటన అనుకున్న తేదీన జరుగుతుందా అనే ఆసక్తి జనసేన శ్రేణులతో పాటు స్థానిక ప్రజల్లోనూ నెలకొంది.

