ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి దశ నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా 201 మండలాల్లోని 3949 సర్పంచ్ మరియు 39832 వార్డు సభ్యుల స్థానాలకు గాను పరిశీలన అనంతరం 21393 సర్పంచ్ నామినేషన్లు మరియు 87318 వార్డు సభ్యుల నామినేషన్లు చెల్లుబాటయ్యాయి. మొదటి దశలో అత్యధికంగా తిరుపతి జిల్లాలో 2267 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో నిలవగా అనకాపల్లి జిల్లాలో 6515 వార్డు సభ్యుల నామినేషన్లకు ఆమోదం లభించింది.
మరోవైపు రాష్ట్రంలోని 246 మండలాల్లోని 4975 గ్రామ పంచాయతీలకు సంబంధించి రెండో దశ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. తొలి రోజున సర్పంచ్ పదవులకు 3504 నామినేషన్లు మరియు వార్డు సభ్యుల స్థానాలకు 7329 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండో దశలో సర్పంచ్ స్థానాలకు అత్యధికంగా వైఎస్ఆర్ కడప జిల్లాలో 366 నామినేషన్లు రాగా వార్డు స్థానాలకు శ్రీకాకుళం జిల్లాలో 845 నామినేషన్లు నమోదయ్యాయి.

