హైదరాబాద్ నగరంలోని టోలిచౌకి పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ రమేష్ నాయక్ 20 వేల రూపాయల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. నిబంధనల ప్రకారం రాత్రి ఒంటి గంటకు మూసివేయాల్సిన ఒక హోటల్ ను ఆ తర్వాత కూడా నడిపించుకునేందుకు నెలకు 50 వేల రూపాయల మామూలు మాట్లాడుకున్నట్లు విచారణలో తేలింది. మొదటి నెలలో పది వేల రూపాయల రాయితీ ఇచ్చి మిగిలిన మొత్తంలో 20 వేల రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
అనంతరం ఇన్ స్పెక్టర్ క్యాబిన్ లో తనిఖీలు నిర్వహించిన ఏసీబీ అధికారులకు నాలుగు వేర్వేరు కవర్లలో దాచిన లక్ష 85 వేల రూపాయల లెక్కలేని నగదు లభ్యమైంది. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు అధికారులే ఇలా వ్యాపార ఒప్పందాల మాదిరిగా మామూళ్లు వసూలు చేయడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన అధికారులు అతని ఆస్తులపై కూడా ఆరా తీస్తున్నారు.

