ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏనుగులతో పంట నష్టపోతున్న రైతులకు సహాయకరంగా ఉండేందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుంకీ ఏనుగులను తీసుకొచ్చేందుకు కృషి చేసిన సంగతి తెలిసిందే. దీని కోసం గతంలో ఆయన కర్ణాటకకు వెళ్లి, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో ప్రత్యేకంగా సమావేశమై కుంకీ ఏనుగులను ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఆరు కుంకీ ఏనుగులను ఏపీకి ఇచ్చేందుకు అక్కడి ప్రభుత్వం అంగీకరించింది. బెంగళూరులోని విధానసౌధలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, అటవీశాఖ మంత్రి ఈశ్వర ఖండ్రే ఈ ఏనుగుల బదిలీ ఆదేశ పత్రాలను డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు అందించారు. ఈ ఒప్పందం ప్రకారం ఆరు కుంకీ ఏనుగులను ఏపీ అప్పగించాల్సి ఉండగా శిక్షణ, ఆరోగ్య ప్రమాణాల దృష్ట్యా బుధవారం నాలుగింటిని తరలించారు. మరో విడతలో మిగిలిన రెండూ వస్తాయి. ఈ విషయంపై పవన్ కల్యాన్ ను ప్రశంసిస్తూ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ఉమ్మడి చిత్తూరుజిల్లాలో రైతు సోదరుల కష్టాలకు చెక్ పెట్టేందుకు కర్నాటక నుంచి కుంకీ ఏనుగులను రప్పించిన డిప్యూటీ సీఎం పవనన్నకు నా శుభాభినందనలు. యువగళం పాదయాత్ర సందర్భంగా ఏనుగుల విధ్వంసంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని పలమనేరు ప్రాంత రైతన్నలు నా దృష్టికి తెచ్చారు. రైతాంగం ఇక్కట్లను తొలగించేందుకు పవనన్న ప్రత్యేకంగా చొరవచూపి కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించారు. ఏపీ అవసరాలకు మరిన్ని కుంకీ ఏనుగులు ఇస్తామని హామీ ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వానికి కూడా నా కృతజ్ఞతలు అని ఆయన పోస్టులో పేర్కొన్నారు.