ఏపీలో వరుస అత్యాచారాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. రాష్ట్రంలో బాలికలు అత్యాచారాలకు గురవుతుంటే.. సీఎం, డిప్యూటీ సీఎం షూటింగ్ లలో ఉన్నారని విమర్శిస్తోంది. ఈమేరకు ఆ పార్టీ అధికారిక ఖాతాల్లో వరుస పోస్టులు పెడుతున్నారు. రెడ్ బుక్ పాలనలో అంతులేని అఘాయిత్యాలు జరుగుతున్నాయని విమర్శిస్తున్నారు. గత నాలుగు నెలల్లోనే 74 మంది మహిళలపై దాడులు, అత్యాచారాలు, వేధింపులు జరిగాయని ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో వరుసగా అత్యాచారాలు జరుగుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు తన వియ్యంకుడు నడిపించే ‘ఆహా షో’ షూటింగులో బిజీగా మారారని మండిపడుతున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. పాలన వదిలేసి ఓజీ షూటింగ్ లో ఉన్నారని చెబుతున్నారు. హిందూపురంలో ఇటీవల అత్తాకోడళ్లపై అత్యాచారం జరిగితే.. ఎమ్మెల్యే బాలకృష్ణ కనీసం స్పందించలేదని విమర్శిస్తున్నారు. ఇదే విషయంపై ఇటీవల మాజీ మంత్రి ఆర్కే రోజా సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. వైసీపీ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ టీజేఆర్ సుధాకర్ బాబు సైతం ఆడబిడ్డల అత్యాచారంపై ఆవేదన వ్యక్తం చేశారు.