కేంద్ర మంత్రిపై భగ్గుమంటున్న ప్రతిపక్షాలు
పార్లమెంట్ లో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడిన మాటలపై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత ఎదురవుతోంది. ప్రతిపక్షాలు అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. కాగా, రాజ్యసభలో అమిత్ షా ఏం మాట్లాడారంటే.. “ఈ మధ్య అంబేడ్కర్.. అంబేడ్కర్.. అంబేడ్కర్ అని అనడం ఫ్యాషన్ అయింది. ప్రతిపక్షాలు దేవుడి పేరు స్మరించి ఉంటే స్వర్గానికి చేరుకునేవారు”అని అన్నారు. దీంతో ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. బీజేపీకి అంబేడ్కర్ అంటే ఎలాంటి దురుద్దేశం ఉందో అమిత్ షా చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని కాంగ్రెస్ పేర్కొంది. తమిళనాడు నటుడు, తమిళగ వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు విజయ్ కూడా దీనిపై స్పందించారు. అంబేడ్కర్ అంటే కొంతమందికి గిట్టదని, కానీ అంబేడ్కర్ పేరు వెంటే సంతోషంగా ఉంటుందన్నారు. దేశవ్యాప్తంగా ఎదురవుతున్న వ్యతిరేకతపై అమిత్ షా స్పందించారు. తన మాటలను వక్రీకరించారని, తాను ఏనాడూ అంబేడ్కర్ ను అవమానించలేదన్నారు.