1970 నుంచి తబలా శబ్దం వినగానే మనందరికీ గుర్తుకు వచ్చే పేరు జాకీర్ హుస్సేన్. అంతకుముందు ప్రముఖ తబలా విద్వాంసులు ఎంతోమంది ఉన్నప్పటికీ ప్రసార మాధ్యమాలు అంతగా లేకపోవడంతో వారంతా మనుగడలోకి రాలేదు. 1951 మార్చి 9న ముంబయిలో పుట్టిన జాకీర్ హుస్సేన్.. తండ్రి వద్దే తబలా నేర్చుకున్నాడు. తనకు జన్మనిచ్చిన వ్యక్తి, విద్య నేర్పిన వ్యక్తి ఒకరే కావడం తన అదృష్టంగా భావిస్తానని జాకీర్ హుస్సేన్ తరచూ చెప్పేవారు. ఎక్కడ ప్రదర్శనలు ఇచ్చినా, తన తండ్రి ఫొటోను వెనకాలే పెట్టుకునేవారు. పిన్నవయసులోనే తబలా నేర్చుకొని, గల్లీ ప్రదర్శనలు ఇస్తూ.. నేడు ప్రపంచంలోనే ప్రముఖ తబలా విద్యాంసులుగా ఎదిగారు. 1990లో భారత ప్రభుత్వం నుంచి సంగీత్ నాటక్ అకాడమీ అవార్డు గెలుచుకున్నారు. అమెరికాలోనూ ప్రదర్శనలు ఇచ్చి, పరదేశీయుల మన్ననలు సైతం పొందారు. అమెరికా ప్రభుత్వం అతనికి నేషనల్ ఎండోమెంట్ ఫర్ ఆర్ట్స్ నేషనల్ హెరిటేజ్ ఫెలోషిప్ తో సత్కరించింది. ఇది లలిత కళా రంగంలో ఇచ్చే అతి పెద్ద అవార్డు. ఐదు సార్లు గామీ అవార్డులు సైతం గెలుచుకున్నారు. 1998లో పద్మశ్రీ, 2002లో పద్మభూషన్, 2023లో పద్మ విభూషణ్ అవార్డులు వరించాయి. 2005 అనంతరం అమెరికాలో స్థిరపడ్డ జాకీర్.. అంతర్జాతీయ కళాకారులతోనూ కలిసి పనిచేశారు. రెండు వారాల క్రితం రక్తపోటు సంబంధిత వ్యాధులతో బాధపడుతూ అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ ఆసుపత్రిలో చేరి, ఆదివారం సాయంత్రం మృతి చెందారు.