దామగుండంలో ఏర్పాటు చేయబోయే రాడార్ సెంటర్ దేశం గర్వించే ప్రాజెక్టు అని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ ఎంపీలు బండి సంజయ్, విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి వికారాబాద్ లోని దామగుండం అడవుల్లో రాడార్ కేంద్రం ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. ఈ రాడర్ దేశ సైన్యానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రాడార్ సెంటర్ ఏర్పాటుకు సహకరించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలా జయంతి సందర్భంగా.. వారి సేవలను కొనియాడారు. వారి జయంతి రోజున ఈ సెంటర్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.
దేశ రక్షణలో రాజకీయం తగదు: రేవంత్ రెడ్డి
దేశ రక్షణకు ఉపయోగపడే దామగుండం రాడార్ సెంటర్ ఏర్పాటుపై రాజకీయాలు చేయడం తగదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కొందరు కావాలనే దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమిళనాడులో 1990లో ఇలాంటిది ఏర్పాటు చేశారని, అక్కడి ప్రజలకు ఎలాంటి నష్టం జరగలేదన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే రాడార్ సెంటర్ ఏర్పాటుకు స్థల సేకరణ జరిగిందని గుర్తు చేశారు.