నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలపై వేటు
అధికార వైఎస్ఆర్‌సీపీ నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేసింది. ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌లో.. విప్ ఉల్లంఘించినందుకు నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విప్ ఉల్లంఘించినందుకుగానూ, క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినందుకుగానూ నలుగురు వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ విధిస్తున్నట్లు సజ్జల ప్రకటించారు. ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, కోటం శ్రీధర్‌రెడ్డిపై వేటు వేస్తున్నట్లు తెలిపారు. ఈ నలుగురు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్లు పార్టీ గుర్తించిందని సజ్జల చెప్పుకొచ్చారు. క్రాస్ ఓటింగ్‌పై అంతర్గత విచారణ జరిపాం. దర్యాప్తు తర్వాతే నలుగురిపై చర్యలు తీసుకున్నామని మీడియాకు వివరించారు.
నిన్నటి ఎన్నికల కోసం డబ్బులు చేతులు మారినట్లు పార్టీ విశ్వసిస్తోంది. ఎమ్మెల్యేలను చంద్రబాబు కొన్నారు. ఒక్కోక్కొరికి రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్లకు చంద్రబాబు ఆఫర్ చేశారు. క్రాస్ ఓటింగ్ చేసినవాళ్లకు టికెట్ కూడా ఇస్తామని టీడీపీ చెప్పి ఉండవచ్చు అని సజ్జల అనుమానం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా వైఎస్ జగన్ నిర్ణయంపై రాష్ట్రంలో సర్వత్రా చర్చ జరుగుతోంది. సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి