గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2023 తొలి రోజు సక్సెస్
రూ.11.85 లక్షల కోట్లకు… సంబంధించిన 92 ఎంఓయూలును
పలు కీలక రంగాల్లో ఏపీ ప్రభుత్వం ఎంవోయూలు
ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మారబోతోంది. రాష్ట్రానికి పెట్టుబడులు వరదలా వస్తున్నాయి. దేశ, విదేశీ కార్పోరేట్ దిగ్గజాలన్నింటినీ ఒకే వేదికపై తీసుకురావడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2023’ తొలి రోజు సూపర్ సక్సెస్ అయ్యింది. శుక్రవారం నిర్వహించిన సమ్మిట్‌కు పారిశ్రామిక దిగ్గజాలు ముఖేష్ అంబానీ, కుమార మంగళం బిర్లా వంటి 30కి పైగా కార్పొరేట్ దిగ్గజ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సమ్మిట్‌లో రూ.13 లక్షల కోట్ల విలువైన 340 పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలతో ముందుకు వచ్చారు. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 20 రంగాల్లో దాదాపు 6 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఈ రోజు రూ.11.85 లక్షల కోట్లు విలువైన పెట్టుబడులకు సంబంధించిన 92 ఎంఓయూలును కుదుర్చుకోనున్నారు. వీటి ద్వారా దాదాపు 4లక్షల మందికి ఉద్యోగాలు రానున్నాయి. మిగిలిన 248 ఎంఓయూలు రేపు కార్యరూపం దాల్చనున్నాయి. ఈ ఒప్పందాల విలువ రూ.1.15 లక్షల కోట్లు కాగా… వీటి ద్వారా దాదాపు 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.
రిలయెన్స్ గ్రూపు, ఆదానీ గ్రూప్, ఆదిత్య బిర్లా గ్రూప్, రెన్యూ పవర్, అరబిందో గ్రూప్, డైకిన్, ఎన్టీపీసీ, ఐఓసీఎల్, జిందాల్ గ్రూప్, మోండలీస్, పార్లీ, శ్రీ సిమెంట్స్ వంటి కంపనీలు ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయడంతో పాటు మరికొన్ని తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి.
ఆకట్టుకున్న సీఎం వైఎస్ జగన్ ప్రసంగం
ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు – 2023లో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగం పారిశ్రామికవేత్తలను ఆకట్టుకుంది. రాష్ట్రం బలాలు, ఇక్కడి విభిన్న అవకాశాలను, వ్యాపార రంగంలో స్నేహపూర్వక వాతావరణం, బలమైన మౌలిక సదుపాయాలు, ఆరోగ్యకరమైన పోటీ, ఆవిష్కరణల విషయంలో రాష్ట్రం తీసుకుంటున్న చర్యలను సీఎం వైఎస్ జగన్ వివరించారు. పలు ప్రభుత్వ, మరియు ప్రైవేట్ రంగ యూనిట్లు, పోర్ట్ ఆధారిత మౌలిక సదుపాయాలు, మెడ్‌టెక్ జోన్ మరియు టూరిస్ట్ హాట్‌స్పాట్‌లతో విశాఖపట్నం అత్యంత బలమైన బలమైన ఆర్థిక కేంద్రంగా ఆవిర్భవించింది. విశాఖపట్నం కేవలం పారిశ్రామిక రంగంలో బలమైన నగరమే కాకుండా, ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందింది.
అభివృద్ధి పథంలో ఏపీ..
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 11.43% జీఎస్‌డీపీ వృద్ధిరేటు సాధించింది, ఇది దేశంలోనే అత్యధికం. ఇంకా, గత మూడు సంవత్సరాలల్లో ఎగుమతులు కూడా వృద్ధిచెందాయి. సీఏజీఆర్(సగటు వార్షిక వృద్ధిరేటు) 9.3% నమోదయ్యింది. సుస్థిరమైన, స్థిరమైన అభివృద్ధి కోసం మేం చేస్తున్న ప్రయత్నాలను నీతి ఆయోగ్ కూడా గుర్తించింది. సామాజిక, ఆర్థిక మరియు పర్యావరణ అంశాల్లో 2020–21 ఏడాదికి ఇచ్చిన ఎస్‌జీడీ ఇండియా ఇండెక్స్ ర్యాంకింగ్స్‌లో రాష్ట్రం నంబర్ 3వ స్థానంలో నిలిచింది. అట్టడుగు స్థాయిలో పరిపాలనను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక విప్లవాత్మక సంస్కరణలను తీసుకొచ్చింది. వ్యాపార వాతావరణాన్ని సృష్టించడంకోసం, స్థిరమైన విధానాలు, పోటీతత్వాన్ని పెంపొందించడానికి, తక్కువ రిస్క్ పెట్టుబడి వాతావరణాన్ని కల్పించడానికి, పారదర్శకతను పెంపొందించడానికి ఈ చర్యలు తీసుకుంది. మొత్తానికి విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒప్పందం చేసుకున్న సంస్థలన్నీ ఇక్కడ పరిశ్రమలు పెడితే రాష్ట్రం అభివృద్ధిపథంలో దూసుకుపోతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.