అచ్చం మనుషుల్లాగే పనిచేస్తుంది.. చాట్ జీపీటీ కొత్త వెర్షన్ ప్రత్యేకతలు ఇవే!
చాట్ జీపీటీ గురించి తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. తక్కువ వ్యవధిలోనే ప్రపంచాన్ని షేక్ చేసిందీ చాట్ బాట్. భాష అనువాదం, తెలియని విషయాలను తెలియజేయడం, వివరణాత్మక స్పందనలు లాంటివి చాట్ జీపీటీ ప్రత్యేకత. ఏ విషయం గురించైనా అర్థవంతంగా, తులనాత్మకంగా, సులువగా చెప్పగలగడం దీని స్పెషాలిటీ. కవితలూ రాయగలదూ.. కంప్యూటర్ ప్రోగ్రామూలూ రాయగలదు చాట్ జీపీటీ. అలాంటి చాట్ జీపీటీలో కొన్ని విషయాల్లో కచ్చితమైన సమాధానాలు లేవన్నది అప్పట్లో లోపంగా గుర్తించారు.
లోపాలు ఉండటంతో దీన్ని డెవలప్ చేసిన ఓపెన్ ఏఐ సంస్థ తాజాగా కొత్త వెర్షన్ తీసుకొచ్చింది. మరిన్ని ప్రత్యేకతలు జోడిస్తూ తాజాగా చాట్ జీపీటీ అప్డేటెడ్ వెర్షన్ను తీసుకొచ్చింది. అదే చాట్ జీపీటీ వెర్షన్-4. ఇది దాదాపుగా మనిషిలాగే పనిచేస్తుందని ఓపెన్ ఏఐ వివరించింది. మనిషి లాంటి సాంకేతికత ఇందులో ఉంటుందని వెల్లడించింది. ఈ నయా వెర్షన్ మరింత సేఫ్గా వర్క్ అవుతుందని పేర్కొంది. ప్రస్తుతం ఓపెన్ ఏఐ ప్లాన్ చాట్ జీపీటీ ప్లస్ సబ్‍స్క్రైబర్లకు మాత్రమే ఈ జీపీటీ-4 అందుబాటులో ఉంది. త్వరలో అందరికీ అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.