టీవీ స్క్రీన్ను క్లీన్ చేస్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
రోజువారీ జీవితంలో టీవీ ఓ భాగంగా మారిపోయింది. ముఖ్యంగా ఇంటి పట్టున ఉండే గృహిణులు, వృద్ధులకు టీవీనే కాలక్షేపం అనేది తెలిసిందే. ఒకప్పటి మాదిరిగా కాకుండా ఇప్పుడన్నీ ఎల్సీడీ, ఎల్ఈడీ, ఓల్ఈడీ టీవీలు వచ్చేశాయి. ఇవి చాలా సున్నితంగా ఉంటాయి. ఇది తెలియక చాలా మంది ఇష్టం వచ్చినట్లు వాటిని తుడుస్తుంటారు. కానీ అది సరికాదు. వీటిని క్లీన్ చేసే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో తెలుసుకుందాం.
టవల్స్ కంటే ఇవి బెటర్
టీవీలను క్లీనింగ్ చేసే సమయంలో చాలా మంది తువ్వాళ్లు, టిష్యూలతో తుడుస్తూ ఉంటారు. ఫలితంగా వాటి మీద గీతలు పడతాయి. అందుకే స్మార్ట్ టీవీలను శుభ్రం చేసేటప్పుడు టవల్స్కు బదులుగా మైక్రోఫైబర్ క్లాత్స్ను ఉపయోగించాలి. స్క్రీన్పై పడిన మరకలను ఈ క్లాత్తో తుడిస్తే.. పూర్తిగా తొలిగిపోతాయి. అంతేగాక స్క్రీన్పై ఎలాంటి స్క్రాచెస్ కూడా పడవు.
స్ప్రే చేయొద్దు
టీవీ తెరను క్లీన్ చేసే సమయంలో.. నేరుగా స్క్రీన్ మీద ఎలాంటి లిక్విడ్ స్ప్రేలు చేయకూడదు. అలా స్ప్రే చేస్తే టీవీలోని ఇంటర్నల్ పార్ట్స్ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. దీంతో పాటు స్క్రీన్పై శాశ్వతంగా కొన్ని మరకలూ ఏర్పడే చాన్స్ ఉంది. అమ్మోనియా, ఆల్కహాల్, అసిటోన్ వంటి స్ప్రేలనూ ఉపయోగంచకూడదు. ఎందుకంటే ఇవి స్క్రీన్ మీద ఉండే యాంటీ గ్లేర్ పూతను దెబ్బతీస్తాయి. అసలు టీవీని శుభ్రం చేసే సమయంలో స్ప్రేలను వాడకూడదని గుర్తుంచుకోవాలి
ఆ టైమ్లో టీవీ ఆఫ్లోనే..
టీవీని ఆన్లో ఉంచి ఎప్పుడూ క్లీన్ చేయకూడదు. ఆఫ్ చేసిన తర్వాతే దాన్ని క్లీన్ చేయాలి. ఆన్లో ఉంచి శుభ్రం చేస్తే విద్యుత్ ప్రమాదాలు జరిగే చాన్సులు ఉన్నాయి. లిక్విడ్తో క్లీన్ చేసినప్పుడు తడి ఉన్నప్పుడు టీవీ ఆన్ చేయకూడదని గుర్తుంచుకోవాలి. అది పూర్తిగా పొడిగా మారిన తర్వాతే టీవీని ఆన్ చేయాలి.
వస్త్రం మార్చాల్సిందే!
స్మార్ట్ టీవీ తెరను తుడిచే సమయంలో వస్త్రాన్ని బాగా తిప్పుతూ ఉండాలి. బట్టలోని ఒకే భాగంతో దానికి అంటిన దుమ్ము, ధూళి మొత్తం స్క్రీన్కు అంటుకునే డేంజర్ ఉంది. శుభ్రం చేసే టైమ్లో క్లాత్కు ఎక్కువ దుమ్ము అంటినట్లు అనిపిస్తే.. వెంటనే దాన్ని తిప్పాలి లేదా మరో క్లాత్ను ఉపయోగించాలి.
మచ్చలు రావొచ్చు
టీవీ స్క్రీన్ను క్లీన్ చేశాక.. ఆ తడి పూర్తిగా పొడిగా అయ్యే వరకు టీవీని అస్సలు ఆన్ చేయకూడదు. అలా చేస్తే ఆ తడి మచ్చలుగా మారే చాన్స్ ఉంటుంది. కొన్నిసార్లు విద్యుత్ ప్రమాదాలూ జరిగే అవకాశం ఉంటుంది.