దేశంలో పలు చోట్ల కోవిడ్ కేసులు నమోదు అవుతుండటం కలకలం రేపుతోంది. ఇప్పటికే 200లకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇద్దరు కోవిడ్ లక్షణాలతో మృతి చెందారు. కాగా, తాజాగా ఏపీలో కోవిడ్ కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది. విశాఖపట్నంలోని పిఠాపురం కాలనీలో ఓ మహిళకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కాస్త అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో సూచించారు. మరోవైపు కడప జిల్లాలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఓ వ్యక్తి తీవ్ర జ్వరంతో కడప రిమ్స్ లో చేరాడు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. సదరు వ్యక్తి నంద్యాల జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఏపీలో కేసులు నమోదు అవుతుండటంతో అధికారులు అప్రమత్తం అవుతున్నారు.