తెలంగాణ రాష్ట్రంలో కొత్త చేయూత పెన్షన్లు మరియు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాలకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసినట్లు మంత్రి సీతక్క ప్రకటించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నవంబర్ 26వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల 63 వేల 857 మంది కొత్త లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా పెన్షన్ నగదును జమ చేయనున్నట్లు వెల్లడించారు. అదే రోజున కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసే బృహత్తర కార్యక్రమాన్ని కూడా ప్రారంభించనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.
రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా సమాజంలోని పేదలకు ఆర్థిక భద్రత మరియు మహిళలకు ఆత్మగౌరవం కల్పించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి సీతక్క పేర్కొన్నారు. కొత్తగా మంజూరు చేసిన చేయూత పెన్షన్ల ద్వారా వితంతువులు ఒంటరి మహిళలు దివ్యాంగులు చేనేత మరియు గీత కార్మికుల కుటుంబాలకు నెలవారీ ఆర్థిక భరోసా లభించనుంది. పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న అర్హులందరికీ నవంబర్ 26 నుంచే ప్రయోజనం అందేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆమె తెలిపారు.

