తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నేత, మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు స్థానిక రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. రానున్న ఎన్నికల్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి కుటుంబం తప్పనిసరిగా పోటీ చేయాలని ఆయన సవాల్ విసిరారు. ఎన్నికల్లో ఆ కుటుంబం బరిలోకి దిగకపోతే రాజకీయంగా ఉనికి కోల్పోయినట్లేనని వ్యాఖ్యానించారు. మున్సిపల్ చైర్మన్ పదవి ఓసీ వర్గానికి కేటాయిస్తే తమ కుటుంబం నుంచి ఒకరు పోటీ చేస్తారని తెలిపారు. ఈ ఎన్నికలు తనకు, కేతిరెడ్డి పెద్దారెడ్డికి మధ్య జరిగే రాజకీయ పోరాటమని పేర్కొంటూ, తాడిపత్రిలో రెండు కుటుంబాల మధ్య ఉన్న పోటీ కీలకంగా మారుతుందని అన్నారు. ప్రజలు అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
మరోవైపు వైసీపీ నాయకులు రమేష్ రెడ్డి, ఫయాజ్ భాష మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయవద్దని జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. వారు పోటీ చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. అలాగే కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఇష్టం లేని అధికారులు, పోలీసుల వివరాలు అందిస్తే వారిని సెలవుపై వెళ్లేలా చేస్తానని అన్నారు. ఎన్నికల్లో రిజర్వేషన్లు ఇంకా స్పష్టతకు రాకపోవడంతో పోటీ చేసే అభ్యర్థులపై ఉత్కంఠ కొనసాగుతోంది. జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలతో తాడిపత్రిలో టీడీపీ, వైసీపీ మధ్య రాజకీయ వాతావరణం మరింత వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.

