హైదరాబాద్‌లోని చెరువు భూముల పరిరక్షణ కోసం ఆక్రమణలు తొలగించటం, కబ్జాల్లో ఉన్న చెరువులు, కుంటలను రక్షించి ఆ భూములను తిరిగి ప్రభుత్వం పరిధిలోకి తీసుకురావడం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హైడ్రాను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులకు చెందిన భవనాలను సైతం హైడ్రా కూల్చి వేసింది. ఈ క్రమంలో హైడ్రా ఓవైసీ ఫాతీమా కాలేజీ కూల్చివేయకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనిపై హైడ్రా క్లారిటీ ఇచ్చింది. ఎంఐఎం పార్టీ నేతల ఆస్తుల వ్యవహారంలో హైడ్రా కఠినంగానే వ్యవహరిస్తుందని, ఫాతీమా కాలేజీని కేవలం మానవతా దృక్పథంతోనే కూల్చడం లేదని స్పష్టం చేసింది. ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న ఒవైసీ ఫాతిమా కాలేజీపై హైడ్రా చర్యలు తీసుకోవాల్సి ఉంది. పేద ముస్లిం మహిళల కోసం ఎలాంటి ఫీజులు లేకుండా ఈ సంస్థను నిర్వహిస్తున్నారని, 10 వేల మందికి పైగా విద్యార్థులు ఈ సంస్థలో చదువుతున్నారని అందుకే మానవీయ కోణంలో ఆలోచించి ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నామని హైడ్రా పేర్కొంది.