మున్సిపల్ ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్మల్ మున్సిపాలిటీ పాలకవర్గ కాల పరిమితి ఈ ఏడాది మార్చి 25వ తేదీన ముగిసినా, ఎన్నికలు నిర్వహించకపోవడంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి శనివారం విచారించింది. తక్షణమే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు. కాగా, వార్డు రిజర్వేషన్లు పూర్తయ్యాకే ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తామని ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. ఈ విషయంపై ప్రభుత్వాన్ని నివేదిక కోరగా ప్రభుత్వం తరఫు న్యాయవాది రెండు వారాల గడువు అడిగారు. దీంతో ధర్మాసనం తదుపరి విచారణను జూలై 11వ తేదీకి వాయిదా వేసింది.