వచ్చే ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఎలక్షన్స్ ను కురుక్షేత్ర యుద్ధంగా అభివర్ణించిన ఆయన.. ఆ యుద్ధంలో ప్రజలు తనకు అండగా నిలబడాలని కోరారు. పేదల ప్రభుత్వం ఒకవైపున.. పేదల్ని మోసగించిన వాళ్లు మరోవైపున ఉన్నారని జగన్ విమర్శించారు. తమ సర్కారు వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ అని.. పేదల గొంతుకై నిలిచిన ప్రభుత్వం ఇదని తెలిపారు. తమది మనసున్న ప్రభుత్వం అని.. గత పాలకులకు అసలు మనసనేదే లేదన్నారు సీఎం. పేదల కోసం తమ గవర్నమెంట్ పనిచేస్తోందన్నారు. విజయవాడలో వరుసగా ఐదో ఏడాది వాహనమిత్ర నిధులను ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ ఆయన పైకామెంట్స్ చేశారు.
వైసీపీ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతీ హామీని తాము అమలు చేశామని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. అదే గత ప్రభుత్వం మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిందని మండిపడ్డారు. వివక్ష, లంచానికి తావులేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదును జమచేశామన్నారు. ఇప్పుడూ ఇదే బడ్జెట్, గతంలోనూ ఇదే బడ్జెట్.. మారిందల్లా కేవలం సీఎం ఒక్కడేనన్నారు. గతంలో ఎందుకు ఈ స్కీమ్స్ ఇవ్వలేకపోయారని జగన్ ప్రశ్నించారు. పేదోడి ప్రభుత్వం నిలబడాలని.. పెత్తందారుల ప్రభుత్వం అధికారంలోకి రాకూడదన్నారు. వచ్చే ఎన్నికల్లో వీటి గురించి ప్రజలు తప్పకుండా ఆలోచించాలన్నారు.
తెలుగుదేశం పార్టీతో పాటు జనసేనను ఉద్దేశించి ముఖ్యమంత్రి జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాళ్లకు పవర్ అనేది దోచుకోవడానికి, దోచుకున్నది పంచుకోవడానికేనన్నారు. వారిలా తనకు దత్తపుత్రుడి, గజదొంగల ముఠా తోడు లేదన్నారు జగన్. మనసున్న ప్రభుత్వానికి.. మనసు లేని పాలకులకు మధ్య రేప్పొద్దున కురుక్షేత్ర యుద్ధం జరగబోతోందన్నారు. ఈ యుద్ధంలో ప్రజలు తనకు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు జగన్. తమ ఇళ్లలో మంచి జరిగిందనిపిస్తేనే ప్రజలు తనకు తోడుగా నిలవాలని ఆయన కోరారు. ఓటు వేసే ముందు తమ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి ప్రజలు ఆలోచించాలని జగన్ పేర్కొన్నారు.