Monday, November 4, 2024

కాఫీతో మధుమేహానికి కళ్లెం వేయొచ్చా? ఇది సాధ్యమేనా?

Must Read

కాఫీతో మధుమేహానికి కళ్లెం వేయొచ్చా? ఇది సాధ్యమేనా?

కాఫీని ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మన దేశంలో ఎక్కువగా టీ తాగే వారు ఉన్నప్పటికీ.. ప్రతి ఇంట్లో ఒక్కరైనా కాఫీ లవర్ ఉంటారు. కాఫీ తాగితే వచ్చే కమ్మటి రుచి వేరే ఏ తేనీటికీ ఉండదేమో! పొద్దుపొద్దునే ఓ స్ట్రాంగ్ కాఫీ తాగితే ఆ రోజు మొత్తం ఉండే కిక్కే వేరని చాలా మంది భావిస్తుంటారు. దీన్ని పాటించే వారూ ఉన్నారు. కొందరైతే రోజులో మూడు సార్లు కూడా కాఫీ తాగుతుంటారు.

కాఫీతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాఫీతో షుగర్ వ్యాధిని తరిమికొట్టొచ్చట. దీనికి సంబంధించి తాజాగా ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి. రక్తంలో కెఫీన్‌ మోతాదులు ఎక్కువగా ఉండేవారికి టైప్‌2 మధుమేహం ముప్పు చాలా తక్కువగా ఉంటున్నట్టు యూరప్ లో నిర్వహించిన ఓ అధ్యయనంలో బయటపడింది.

కాఫీ తాగడం వల్ల బరువు తగ్గుతుందట. దీంతో మధుమేహం ముప్పు తగ్గుతుందని ఆ అధ్యయనంలో తేలింది. ఇందులో కెఫీన్‌తో కూడిన పానీయాల ఉపయోగం కంటే.. బాడీలో కెఫీన్‌ ఎలా విచ్ఛిన్నమవుతోందనే దాని మీదే ఎక్కువగా దృష్టి సారించడం గమనార్హం. కెఫీన్ జీవక్రియ తక్కువగా ఉండేవారిలో ఇది విచ్ఛిన్నం అయ్యేందుకు ఎక్కువ టైమ్ పడుతోందని, అందువల్ల రక్తంలో దీని మోతాదులు అధికంగా ఉంటున్నట్లు సైంటిస్టులు గుర్తించారు.

బరువు తగ్గించే మాత్రల్లో కెఫీన్ వాడకం!

కెఫీన్‌ వినియోగానికి బరువు తగ్గడానికీ మధ్య సంబంధం ఉంటున్నట్లు చాన్నాళ్లుగా తెలిసిందే. అందుకే బరువు తగ్గించే ఔషధాల్లో తప్పనిసరిగా కెఫీన్‌ను చేర్చుతుంటారు. శరీరం ఎక్కువ శక్తిని ఖర్చు చేసుకునేలా కెఫీన్ పురిగొల్పుతుందని అంటారు. ఇలా బరువు తగ్గడానికి ఇది తోడ్పడుతుంది. అయితే బరువు తగ్గితే మధుమేహం, గుండెజబ్బులు, పక్షవాతం లాంటి సమస్యల ముప్పూ చాలామటుకు తగ్గుతుంది. మరి కాఫీ ఎక్కువగా తాగడం ద్వారా షుగర్ వ్యాధిని నివారించొచ్చా? ఇందులో నిజమెంత?

మధుమేహం ముప్పును తగ్గించొచ్చా?

తాజా అధ్యయనం కేవలం కెఫీన్‌ వాడకానికి బదులు రక్తంలో కెఫీన్‌ మోతాదుల గురించే చెబుతోందని అందరూ గుర్తించాలి. పైగా ఇవి రెండూ జన్యువులతో ముడిపడి ఉండటం గమనార్హం. శరీరంలో కెఫీన్‌ జీవక్రియలు వేగవంతం కావడంలో సీవైపీ1ఏ2, ఏహెచ్‌ఆర్‌ జన్యువులు పాలుపంచుకుంటున్నట్లు సైంటిస్టులు గుర్తించారు. ఈ జన్యువులు కలిగిన వారిలో కెఫీన్‌ జీవక్రియ నెమ్మదిగా సాగుతోందని.. సగటున తక్కువ కాఫీ తీసుకున్నా రక్తంలో కెఫీన్‌ మోతాదులు మాత్రం ఎక్కువగా ఉంటున్నాయని సైంటిస్టులు అంటున్నారు. ఇది బరువు తగ్గడానికి తోడ్పడుతోందని.. ఫలితంగా మధుమేహం ముప్పు 43 శాతం వరకు తక్కువగా ఉంటోందని చెబుతున్నారు.

వారికి మాత్రమే బెనిఫిట్

ఈ లెక్కన కెఫీన్‌ జీవక్రియ నెమ్మదిగా సాగే స్వభావం కలిగినవారు, తక్కువ కెఫీన్‌ తీసుకున్నా దీని ప్రయోజనం ఎక్కువగా కనిపిస్తోందని అర్థం చేసుకోవాలి. అంతే తప్ప కాఫీ ఎక్కువగా తాగితే మరింత ప్రయోజనం ఉంటుందని అధ్యయనం సూచించడం లేదని గమనించాలి. కాఫీ వాడకం మితిమీరితే గుండె వేగం పెరగడంతో పాటు ఆందోళన, చిరాకు, చేతుల వణుకు, నిద్రలేమి, తలనొప్పి లాంటి ఇతరత్రా తీవ్ర సమస్యలకూ దారితీస్తుంది. అంతేకాదు.. కాఫీతో పాటు చక్కెర వినియోగం పెరిగినా మేలు కంటే కీడే అధికంగా జరుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
- Advertisement -
Latest News

మంత్రి సుభాశ్ కు చంద్రబాబు వార్నింగ్!

ఏపీ సీఎం చంద్రబాబు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ పై మండిపడ్డట్లు తెలుస్తోంది. మంత్రి పనితీరు, సభ్య నమోదు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆయనకు...
- Advertisement -

More Articles Like This

- Advertisement -