ఉరుకుల పరుగుల జీవితంలో అందరూ ఫుల్ బిజీగా అయిపోయారు. పొద్దున లేస్తే స్టడీస్, జాబ్స్, బిజినెస్ అంటూ ఊపిరి సలపనంతగా పరిగెడుతున్నారు. పౌష్టికాహారం తీసుకోకపోవడం, వ్యాయామం చేయకపోవడం, సరిపడా నిద్రలేకపోవడం లాంటి వల్ల ఎన్నో రకాల అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే బలమైన ఆహారం తీసుకోవడం తప్పనిసరి. తాజా కూరగాయలు, పండ్లను తరచూ తీసుకుంటూ ఉండాలని నిపుణులు అంటున్నారు.
తాజా కూరగాయలు తీసుకోవడం శరీరానికి ఎంతో మందని హెల్త్ ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. కాయగూరల్లో ముఖ్యంగా బెండకాయ చాలా మంచిదట. దీనికి సీజన్లతో సంబంధం లేదు. అన్ని సీజన్లలోనూ బెండకాయ లభిస్తుంది. ఇది తింటే డయాబెటిస్ కంట్రోల్ లో ఉండటంతో పాటు పలు హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. న్యూట్రిషన్స్ తో నిండి ఉండే బెండకాయలో ఫైబర్, విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పోషకాలు పుష్కలం
బెండకాయకు ఇంగ్లీషులో రకరకాల పేర్లు ఉన్నాయి. కొందరు దీన్ని లేడీ ఫింగర్ అని పిలిస్తే.. మరికొందరు గుంబో, ఓక్రా అని కూడా అంటారు. అలాంటి బెండకాయలో పోషకాలు మెండుగా ఉంటాయి. కప్పున్నర బెండకాయలు 18 కేలరీలకు సమానం. ఇందులో 4 గ్రాముల కార్బోహైడ్రేడ్లు, జీరో కొలెస్ట్రాల్, 0.2 గ్రాముల ఫ్యాట్, 2 గ్రాముల ఫైబర్, 1.5 గ్రాముల ప్రొటీన్, 5 మిల్లీగ్రాముల సోడియం, 2 గ్రాముల చక్కెర ఉంటుంది. అలాగే మన రోజువారీ అవసరాలకు కావాల్సిన విటమిన్ కే 27 శాతం ఉంటుంది. విటమిన్ సీ 22 శాతం, మాంగనీస్ 9 శాతం, ఫోలేట్ 9 శాతం, మెగ్నీషియం 7 శాతం, థియామిన్ 0.1 శాతం, కాల్షియం 5 శాతం ఉంటుంది.
గుండె సమస్యలకు చెక్
అమెరికా లాంటి కొన్ని దేశాల్లో చాలా మటుకు చావులకు కారణం గుండె నొప్పులే అని నివేదికలు చెబుతున్నాయి. అలాంటి గుండె సంబంధిత సమస్యల నుంచి బయటపడాలంటే ఆరోగ్యకరమైన తాజా బెండకాయల్ని తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కొలెస్ట్రాల్ ను నిరోధించడంలోనూ ఇది కీలక పాత్ర పోషిస్తుందట. ఇందులో పాలీఫెనోల్స్ శాతం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల బీపీ, వాపు లాంటివి కూడా తగ్గుతాయని ఎక్స్ పర్ట్స్ అంటున్నారు.
మధుమేహ నియంత్రణ
బెండకాయలో పుష్కలంగా ఉండే గ్లైసెమిక్ రక్తంలో చక్కెర స్థాయులను అదుపులో ఉంచుతుంది. ఇందులోని ప్రొటీన్ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. ప్రొటీన్ అధికంగా ఉండే బెండకాయల్ని రెగ్యులర్ గా తీసుకుంటే డయాబెటిస్ కంట్రోల్ కు చక్కగా ఉపకరిస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అధిక బరువుతో బాధపడేవారు తరచూ బెండకాయలు తింటే మంచిదట. దీంట్లో క్యాన్సర్ ను తగ్గించే ఔషధ గుణాలు కూడా ఉంటాయి. ఎముకల్ని బలోపేతం చేయడంలోనూ ఇవి దోహదపడతాయట. బెండకాయల్ని కూరగా వండుకొని తినొచ్చు లేదా ఇతర కూరగాయల్లోనూ కలిపి వండుకోవచ్చు.