ఇల్లు కూడా అమ్ముకున్నా.. నా కష్టాలు పగవాడికీ రాకూడదు: మోహన్ బాబు
తెలుగ చిత్రసీమ ఎందరో గొప్ప నటుల్ని అందించింది. వారిలో ఒకరు మోహన్ బాబు. తనదైన డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో ఎంతోమంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు మోహన్ బాబు. ఒక సాధారణ నేపథ్యం నుంచి వచ్చి ఈస్థాయికి చేరుకున్నారు. జీవితంలో ఆయన సాధించని విజయం, చూడని ఎత్తులు లేవంటే అతిశయోక్తి కాదు. జయాపజయాలకు అతీతంగా కెరీర్ను మల్చుకుని గొప్పస్థాయికి చేరుకున్నారు మోహన్ బాబు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకున్నా, ఎవరి అండదండలు లేకున్నా స్వయంకృషితో ఎన్నో సక్సెస్లు చూశారు. అందుకే ఆయన అందరికీ స్ఫూర్తిగా నిలిచారు.
1970లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు మోహన్ బాబు. దాసరి నారాయణరావు రూపొందించిన ‘స్వర్గం నరకం’ సినిమాతో ఆయన నటుడిగా పరిచయమయ్యారు. తన యాక్టింగ్తో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్ గా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. నిర్మాతగా, విద్యావేత్తగా, రాజకీయ నాయకుడిగానూ మెప్పించి బహుముఖ ప్రజ్ఞాశాలిగా నిలిచారు.
అడుగుపెట్టిన ప్రతి దాంట్లో సక్సెస్
దశాబ్దాల సినీ ప్రస్థానంలో మోహన్ బాబు తన స్వయంకృషితోనే ఈస్థాయికి ఎదిగారు. ఎక్కడో రాయలసీమలోని ఒక మారుమూల గ్రామం నుంచి సినీ ఇండస్ట్రీకి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్‌తో తీసిన ‘మేజర్ చంద్రకాంత్’ చిత్రం మోహన్ బాబు ఫిల్మ్ కెరీర్‌లోనే ఎవర్ గ్రీన్ గా చెప్పుకోవాలి. ఆ తర్వాత పెదరాయుడు, శ్రీరాములయ్య, అడవిలో అన్న లాంటి మూవీస్ మోహన్ బాబు స్థాయిని నెక్స్ట్ లెవల్కు తీసుకెళ్లాయి. అనంతరం ‘లక్ష్మీప్రసన్న పిక్చర్స్’ స్థాపించి 50కి పైగా మూవీస్ను నిర్మించారు మోహన్ బాబు. ఆ తర్వాత శ్రీవిద్యానికేతన్ సంస్థల అధినేతగా మోహన్ బాబు విద్యారంగంలోనూ విజయవంతం అయ్యారు.
ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా, ఏర్పేడు మండలం, మోదుగులపాళెంలో 1952 మార్చి 19న మోహన్ బాబు జన్మించారు. ఆదివారం ఆయన 71 వ జన్మదినాన్ని జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మోహన్ బాబు తన కెరీర్‌కు సంబంధించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తాను కష్టాల్లో ఉన్న సమయంలో సాయం చేసేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదని మోహన్ బాబు తెలిపారు.
ఇల్లు అమ్ముకున్నా: మోహన్ బాబు
‘నా కష్టం పగవాడికి కూడా రాకూడదు. మూవీ కెరీర్‌లో ఎదురైన ఇబ్బందుల వల్ల నా ఇల్లూ అమ్ముకున్నా. కానీ ఏ ఒక్క వ్యక్తి కూడా నాకు సాయం చేసేందుకు ముందుకు రాలేదు. సన్నాఫ్ ఇండియా, జిన్నా సినిమాలు ఫెయిల్యూర్‌గా నిలిచాయి’ అని మోహన్ బాబు ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.