ప్రముఖ రియాల్టీ షో బిగ్‌బాస్ పలు భాషల్లో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ బిగ్ బాస్ షోలను ఆయా సినీ ఇండస్ట్రీలకు చెందిన స్టార్ హీరోలు హోస్ట్ చేస్తున్నారు. ‘బిగ్‌బాస్ కన్నడ’కు అక్కడి హీరో కిచ్చా సుదీప్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. దాదాపు 11 సీజన్ల నుంచి హోస్ట్‌గా వ్యవహరించిన సుదీప్.. తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తాను ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా చేయనని వెల్లడించారు.
‘దాదాపు 11 సీజన్ల నుంచి నేను ఎంతగానో ఎంజాయ్ చేసిన కార్యక్రమం బిగ్‌బాస్. హోస్ట్‌గా నాపై విశేషమైన ప్రేమాభిమానాన్ని చూపించినందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. త్వరలో జరగనున్న ఫినాలేతో హోస్ట్‌గా నా ప్రయాణం ముగుస్తోంది. వ్యాఖ్యాతగా నేను మీ అందరికీ వినోదాన్ని మెండుగా అందించాననే భావిస్తున్నా. ఇది ఎప్పటికీ మర్చిపోలేని ప్రయాణం. నాకు సాధ్యమైనంతవరకూ ఉన్నతంగా దీనిని కొనసాగించా. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన వారికి ధన్యవాదాలు.’ అని కిచ్చా సుదీప్ ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు.
ఇదే విషయాన్ని ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలోనూ తెలిపారు. ‘అంతర్గతంగా జరిగిన కొన్ని లోటుపాట్లు కూడా ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం. నా శ్రమకు తగిన గుర్తింపు రాలేదనిపించింది. మిగిలిన భాషల్లో బిగ్‌బాస్ కార్యక్రమానికి వచ్చినంత గుర్తింపు కన్నడ షోకు రాలేదు. మిగిలిన షోలతో మా షోను పోల్చి చూస్తే మా కార్యక్రమానికి మరింత గౌరవం, గుర్తింపు రావాలి. అలాంటి గుర్తింపు లేనప్పుడు దీనికోసం కేటాయించే సమయాన్ని సినిమాలపై పెడితే బాగుంటుందని నా ఫీలింగ్. అందుకే హోస్టింగ్‌కు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నా.’ అంటూ సుదీప్ వెల్లడించారు.