Friday, October 9, 2026

కాక్రోచ్ పార్టీ నిరసనకు పోలీసుల బ్రేక్

Must Read

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో నిరసనకు సిద్ధమైన కాక్రోచ్ జనతా పార్టీకి ఢిల్లీలో ఎదురుదెబ్బ తగిలింది. శనివారం జంతర్ మంతర్ వద్ద నిర్వహించాలనుకున్న ఆందోళనకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. నిరసనకు సంబంధించి తక్కువ వ్యవధిలో దరఖాస్తు చేయడం, గతంలో ఇచ్చిన హామీలను పాటించకపోవడం, ప్రస్తుత శాంతిభద్రతల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. నిబంధనల ప్రకారం కనీసం పది రోజుల ముందుగా అనుమతి కోరాల్సి ఉండగా, పార్టీ ఆలస్యంగా దరఖాస్తు చేసిందని పోలీసులు పేర్కొన్నారు. అంతేకాకుండా న్యూఢిల్లీ ప్రాంతంలో భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 163 అమలులో ఉన్నందున నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరోవైపు నిరసన నేపథ్యంలో జంతర్ మంతర్ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీలో అదనపు పోలీసు బలగాలను మోహరించడంతో పాటు మెట్రో స్టేషన్ల వద్ద కూడా భద్రతా చర్యలు చేపట్టారు. న్యూఢిల్లీ జిల్లాలోని 57 మెట్రో స్టేషన్ల ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలను మూసివేయాలని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌ను పోలీసులు కోరినట్లు సమాచారం. అయితే నిరసనకు అనుమతి నిరాకరించడంపై కాక్రోచ్ జనతా పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రజలు ఆందోళనకు హాజరుకావద్దని పోలీసులు సూచించడం రాజ్యాంగ హక్కులకు విరుద్ధమని పార్టీ ప్రతినిధి సౌరవ్ దాస్ విమర్శించారు. గతంలో నీట్ వివాదానికి సంబంధించి జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళనలకు అనుమతులు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ప్రస్తుత నిర్ణయంపై పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

పవన్ కల్యాణ్ పోలవరం జిల్లా పర్యటన వాయిదా

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పోలవరం జిల్లా పర్యటన మరోసారి వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం శుక్రవారం జరగాల్సిన...
- Advertisement -

More Articles Like This

- Advertisement -