ధర్మస్థలలో విధులు నిర్వహిస్తున్న మీడియా ప్రతినిధులపై జరిగిన దాడిని ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడికి సంబంధించి ఆయన ట్విటర్‌లో వీడియో పోస్టు చేస్తూ స్పందించారు. భక్తుల విశ్వాసానికి నిలయమైన ధర్మస్థల వంటి పవిత్ర ప్రదేశాల్లో గూండా చర్యలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఇలాంటి దాడుల వల్లే ప్రజలు విశ్వసించే ధర్మస్థలాలకు కళంకం అంటుతుంది,’’ అని అన్నారు. సౌజన్య దారుణ హత్యపై న్యాయం కోసం మీడియా మిత్రులు ప్రశ్నలు అడిగితే, నిందితులకు కోపం ఎందుకు వస్తుంది అని ప్రశ్నించారు ప్రకాష్ రాజ్. ‘‘దయచేసి నిందితులను వెంటనే అరెస్టు చేయాలి. సత్యాన్ని వెలికితీసే ప్రయత్నాలు చేయాలి. మీడియాపై దాడులు మానాలి,’’ అంటూ ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. ఇటీవల సౌజన్య హత్య కేసులో న్యాయం కోరుతూ ధర్మస్థలలో మీడియా ప్రతినిధులు కవరేజ్ చేస్తుండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ప్రక్షాళన కోసం ప్రశాంతంగా ఎదురుచూస్తున్న ప్రజల్లో ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు మరింత చైతన్యం నింపుతున్నాయి.