ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్‌లో ఉన్న ప్రసిద్ధ మానసా దేవి ఆలయంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన భయానక తొక్కిసలాటలో 8 మంది భక్తులు దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటనలో మరో 30 మందికి గాయాలు కాగా, వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన ఆలయంలో జలాభిషేకం ఉత్సవం జరుగుతుండగా ఉదయం 2 గంటల సమయంలో చోటు చేసుకుంది. సమాచారం ప్రకారం, ఆలయ ప్రాంగణంలో కోతులు తిష్ట వేసి ఓ విద్యుత్ తీగను కదిలించడంతో అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీని వల్ల భక్తుల్లో ఆందోళన నెలకొని, ఒక్కసారిగా పరుగులు తీయడంతో తొక్కిసలాట ఏర్పడింది. దీంతో చాలా మంది భక్తులు కిందపడిపోగా, ఇతరులు వారి మీదకు ఎక్కుతూ పరుగులు తీశారు. పోలీసులు, విద్యుత్ శాఖ సిబ్బంది వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనపై అధికారికంగా విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి.