హైదరాబాద్ నగరంలోని మలక్‌పేటలో మంగళవారం ఉదయం కాల్పుల ఘటన కలకలం రేపింది. శాలివాహన నగర్ పార్కులో ఉదయం వాకింగ్‌కు వచ్చిన సీపీఐ రాష్ట్ర నాయకుడు చందు నాయక్ (43)పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. కారులో వచ్చిన దుండగులు ఆరు రౌండ్లు కాల్పులు జరిపి ఘటనాస్థలం నుండి పరారయ్యారు. ఈ ఘటనలో చందు నాయక్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. చందు నాయక్ తన భార్య, కుమార్తెతో కలిసి వాకింగ్‌కు వచ్చిన సమయంలో ఈ దాడి జరగడం స్థానికుల్లో భయాందోళనకు గురిచేసింది. పార్కులో వాకింగ్ చేస్తున్న పలువురు ఈ దృశ్యాన్ని చూసి షాక్‌కు గురయ్యారు. మృతుడి స్వస్థలం నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరు మండలం నర్సాయిపల్లి కాగా, ఈ దారుణ హత్యకు భూ వివాదమే కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు పాల్పడ్డవారి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. ఈ ఘటనతో శాలివాహననగర్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.