సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం హెచ్‌సీయూ భూములపై చేసిన కుంభకోణంపై ఆర్బీఐ విచారణ చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. మోదీ రేవంత్ పై విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు. గురువారం ఉదయం కేటీఆర్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. హెచ్సీయూ భూముల్లో రేవంత్ ప్రభుత్వం విధ్వంసం సృష్టిస్తున్నదని మోడీ హర్యానాలో మాట్లాడాడని, మోడీ మాటల వరకేనా? భూముల కుంభకోణంపై విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు నియమించిన సీఈసీ భూములపై కుంభకోణం జరిగిందని, ఇన్విస్టిగేషన్ కమిటీని ఏర్పాటు చేయాలని నిన్న నివేదిక ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ కుంభకోణంపై మా పార్టీ తరఫున అన్ని ఆధారాలతో సహా లేఖ రాశామన్నారు. మోడీకి చిత్తశుద్ధి ఉంటే ఈ కుంభకోణంపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. లేదంటే మోడీ ప్రభుత్వం మాటల ప్రభుత్వమని మేమే కాదు తెలంగాణ ప్రజలు కూడా అనుకుంటారని పేర్కొన్నారు. రేవంత్ చేసిన 10 వేల కుంభకోణం మీద మేం చెప్పిందే నిజమైందన్నారు. కంచె భూములపై రూ.10 వేల కోట్ల కుంభకోణం జరిగిందని వారం రోజుల కింద చెప్పామని గుర్తు చేశారు. నిన్న సీఈసీ ఆ భూములపై ఆర్థిక పరమైన అవకతవకలు, ఉద్దేశపూర్వకంగా చేసిన అరాచక పర్వంపై స్పెషలైజ్డ్ ఏజెన్సీ ద్వారా ఇండిపెండెంట్ ఇన్విస్టిగేషన్ టీంను ఏర్పాటు చేయాలని నివేదిక ఇచ్చిందన్నారు. ఈ రూ.10 వేల కోట్ల కుంభకోణం బయటకు రావాలంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆర్బీఐ కూడా విచారణ చేయాలన్నారు.