కోహ్లీ ఫిట్‌నెస్‌కు అదే కారణమా? అతడు తినే బియ్యం ధరెంతో తెలుసా?
భారత్ క్రికెట్ జట్టులో ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చే ప్లేయర్లలో ముందువరుసలో ఉంటాడు విరాట్ కోహ్లీ. ఆ లెక్కన ప్రపంచంలోని అత్యంత ఫిట్టెస్ట్ ఆటగాళ్లలో విరాట్ ఒకడు. ఆటను మెరుగుపర్చుకోవడానికి ఎంత ప్రాధాన్యం ఇస్తాడో.. ఫిట్‌నెస్‌ను కాపాడుకునేందుకూ అంతే ఇంపార్టెన్స్ ఇస్తాడు. అందుకే వికెట్ల మధ్య చిరుతలా పరుగెత్తుతాడు. విశ్రాంతి లేకుండా క్రికెట్ ఆడుతుంటాడు కోహ్లీ.
పాల ఉత్పత్తులకు దూరం!
విరాట్ అంత ఫిట్‌గా ఉండటానికి ఓ కారణం ఉంది. డైట్ విషయంలో తీసుకునే శ్రద్ధ, కసరత్తులు అతడ్ని అంత బలంగా, చురుగ్గా, ఉత్సాహంగా ఉంచుతున్నాయి. విరాట్ పెరుగు, పాల ఉత్పత్తులు, గోధుమ పిండితో చేసిన చపాతీలు అస్సలు తినడు. వాటికి చాలా దూరంగా ఉంటాడు. తన ఆహారంలో కార్బోహైడ్రేట్లను పెద్దగా తీసుకోడు. ఇది శరీరంలోని కొవ్వును వదిలించుకోవడానికి సాయపడుతుంది. ఇందుకోసం వివిధ పదార్థాలతో చేసిన బ్రెడ్ ను మాత్రమే తీసుకుంటాడు.
ఏంటి అంత రేటా!
కోహ్లీ ఏం తింటాడనేది తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి క్రికెట్ అభిమానిలోనూ ఉంటుంది. అయితే విరాట్ మనం తినే అన్నం తినడు. సాధారణ అన్నం కాకుండా స్పెషల్ రైస్ తీసుకుంటాడు. ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్‌లో ఈ రకమైన బియ్యాన్ని ప్రత్యేక పద్ధతిలో తయారు చేస్తారట. గ్లూటెన్ లేకుండా కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉన్న ఈ బియ్యం.. సాధారణ బియ్యం రుచినే కలిగి ఉంటుందట. ఈ బియ్యం ధర మార్కెట్ లో కిలో రూ.400 నుంచి 500 వరకు ఉంటుందని తెలుస్తోంది.
తీపి అస్సలు తీసుకోడట
ఫిట్ నెస్ విషయంలో ఎంతో శ్రద్ధ వహించే కోహ్లీ.. అందుకోసం చాలా విషయాల్లో రాజీ పడాల్సి వస్తోందని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. తాను మిల్క్ ప్రాడక్ట్స్ తినడం పూర్తిగా మానేశానన్నాడు. గోధుమలతో చేసిన రొట్టెలను కూడా తిననని విరాట్ చెప్పాడు. అదే విధంగా ఫిట్ నెస్ కోసం స్వీట్లు లాంటి తీపి పదార్థాలు కూడా తినడం మానేశానని పేర్కొన్నాడు. ఇది తాను మరింత ఫిట్‌గా ఉండటానికి సాయపడుతోందని స్పష్టం చేశాడు.
ఇష్టమైన దాన్నీ వదిలేశాడు
శరీరాన్ని ఫిట్ గా ఉంచుకునేందుకు ఏం తినాలో తనకు బాగా తెలుసన్నాడు విరాట్. వయసు విషయంలో ఆహారం చాలా కీలకమైన పాత్ర పోషిస్తుందన్నాడు. తను ఫిట్ గా ఉంటే జట్టు కోసం 100 శాతం నిబద్ధతతో సేవలు అందించగలనని వివరించాడు విరాట్. తనకు చాలా ఇష్టమైన ఫుడ్స్‌లో చోలే బటోరే ఒకటన్నాడు. అలాంటి ఈ గ్రేట్ బ్యాటర్.. గేమ్, ఫిట్ నెస్ ను దృష్టిలో పెట్టుకుని చోలే బటోరేనూ తినడం తగ్గించాడట. బ్రేక్ ఫాస్ట్లో మూడు గుడ్లు, ఒక ఆమ్లెట్ తిని రోజును ప్రారంభిస్తాడట విరాట్. అలాగే లంచ్ లో ఉడికించిన చికెన్, మెత్తటి బంగాళదుంపలు, బచ్చలికూర, కాయగూరలను తీసుకుంటాడట. కోహ్లీ డైట్ సీక్రెట్ తెలిసిందిగా.. ఇక మీరూ పాటించేయండి మరి.