రోహిత్ శర్మ తర్వాత టీమిండియా టెస్టు కెప్టెన్ ఎవరనే విషయం చర్చనీయాంశంగా మారింది. ఆస్ట్రేలియా పర్యటనలోనే రోహిత్ రిటైర్మెంట్‌పై చర్చ జరిగింది. అయితే, ఇప్పటికే టీ20లకు గుడ్‌బై చెప్పిన హిట్‌మ్యాన్.. బోర్డర్-గావాస్కర్ ట్రోఫీలో పేలవ ప్రదర్శనతో టెస్టుల నుంచి కూడా తప్పుకోనున్నట్లు కథనాలు వెలువడ్డాయి. కానీ మరి కొంత కాలం సుదీర్ఘ ఫార్మాట్లో కొనసాగాలని నిర్ణయం తీసుకున్నాడు.
అయితే, రోహిత్ శర్మ వారసుడిగా జస్‌ప్రీత్ బుమ్రా పేరు ముందు వరుసలో ఉంది. ఇక, బుమ్రా ఫిట్‌నెస్ మీద అనేక సందేహాలు ఉన్నాయి. టెస్టు కెరీర్‌ను ఎన్నాళ్లు పొడిగించుకోగలడనే ప్రశ్నలు వస్తున్నాయి. ఆయన్ను కెప్టెన్‌ను చేసే విషయంలో సెలక్టర్లు, కోచ్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఈ నేపథ్యంలో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ల పేర్లు తెర మీదకి వచ్చినట్లు సమాచారం. నిలకడగా రాణిస్తూ టెస్టు జట్టులో సుస్థిర స్థానం దిశగా అడుగులు వేస్తున్న జైస్వాల్‌ను జట్టు సారథిగా నియమిస్తే బాగుంటుందని హెడ్ కోచ్ గంభీర్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.