తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నాటి గృహ నిర్మాణ పథకాల లబ్ధిదారులకు ప్రజా ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. 2014 సంవత్సరానికి ముందు ఇళ్ల నిర్మాణం కోసం రుణాలు తీసుకుని వాటిని పూర్తిగా చెల్లించినప్పటికీ ఇంకా ప్రభుత్వ కార్యాలయాల్లో తనఖాలో ఉన్న ఇళ్ల పట్టాలు మరియు పొజిషన్ సర్టిఫికెట్లను వెంటనే లబ్ధిదారులకు తిరిగి ఇచ్చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సంబంధిత అధికారులకు గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
గతంలో గృహ నిర్మాణ పథకాల కింద బ్యాంకు రుణాలు పొందిన పేద ప్రజలు తమ ఇళ్ల పట్టాలను తహసీల్దారు కార్యాలయాల్లో తనఖా పెట్టాల్సి వచ్చేది. నిబంధనల ప్రకారం రుణ వాయిదాలన్నీ పూర్తిగా కట్టేసినప్పటికీ వివిధ పరిపాలనా కారణాల వల్ల లక్షలాది మందికి సంబంధించిన అసలు పత్రాలు దశాబ్దాలుగా ప్రభుత్వ కార్యాలయాల్లోనే ఉండిపోయాయి. తాజా నిర్ణయంతో ఆయా కుటుంబాలకు తమ సొంత ఇంటి పత్రాలపై పూర్తి యాజమాన్య హక్కులు లభించనున్నాయి.

